Hyderabad Police Operation Rope: హైదరాబాద్‌లో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం ఎక్కువైంది. నగరంలోని రహదారులపై రోజు దాదాపు 80లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. 2019తో పోలిస్తే ఏకంగా 18శాతం పెరిగాయి. ద్విచక్రవాహనాలే దాదాపు 56 లక్షల వరకు, 14లక్షల కార్లు ఉన్నాయి.
వాహనాలు అధికసంఖ్యలో రోడ్లపైకి వస్తుండటంతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం కొన్నిమార్గాల్లో కిలోమీటరు ప్రయాణానికి 10నిమిషాల సమయం పడుతోంది. ట్రాఫిక్ పోలీసులు సైతం కొన్ని సమయాల్లో చేతులెత్తేస్తున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణ, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ఉంచడమే.. ట్రాఫిక్ సమస్యలకు కారణమని అధికారులు తేల్చారు.
పలుసమీక్షల తర్వాత హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రిమూవల్ ఆఫ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ ఆండ్ ఎంక్రోచ్మెంట్ - రోప్ పేరిట రూపొందించిన ఆకార్యక్రమాన్ని సీవీ ఆనంద్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఏసమస్య వచ్చినా వెంటనే సమాచారమిచ్చేలా పోలీస్‌శాఖ డయల్ 100 అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు వస్తున్న ఫోన్లలో 80శాతం వరకు ట్రాఫిక్ సమస్యపైనే ఉన్నాయి. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీగా సీవీ ఆనంద్ పనిచేసినప్పుడు ట్రాఫిక్ విభాగంలో చేపట్టిన సంస్కరణలకు మరింత పదునుపెట్టి ఈ ప్రణాళిక రూపొందించారు. వాటిని పక్కాగా అమలుచేసేలా సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.