Police Martyrs Day Celebrations In Telangana: శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలు అరికట్టడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ గోషామహల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రితో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు అధికారులు అమరవీరులకు నివాళి అర్పించారు.
అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరరహిత సమాజ స్థాపనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా డీజీపీ చెప్పారు. పౌరుల భద్రత కోసం పోలీస్‌శాఖలో ఎన్నో సంస్కరణలో తీసుకువచ్చినట్లు హోంమంత్రి తెలిపారు. పోలీసులు రక్షించటంతోనే తాను ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. హనుమకొండ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో సీపీ తరుణ్ జోషి, పోలీసు అధికారులతో కలిసి మంత్రి నివాళి అర్పించారు.
పోలీసుల త్యాగాలు గొప్పవని పేర్కొన్న ఎర్రబెల్లి వారి కుటుంబాలను గౌరవించుకోవడం అందరి విధిగా తెలిపారు. అనంతరం నగరంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో ఎస్పీ రమణకుమార్, మెదక్‌లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన పోలీస్ సంస్మరణ దినోత్సవంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొని నివాళి అర్పించారు.