Police Martyrs Day Celebrations Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar), ఇతర పోలీసు ఉన్నతాధికారులు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదని డీజీపీ తెలిపారు.
విధి నిర్వహణలో భాగంగా దేశ వ్యాప్తంగా ఏటా వందల సంఖ్యలో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. ఈ ఏడాది 189 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్‌ల వరకు విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా పండుగలు, ఏదైనా ఇతర వేడుకలను కుటుంబాలతో కలిసి చేసుకుంటుంటే.. పోలీసులు బందోబస్తులో భాగంగా రహదారులపైనే ఉంటారని అంజనీ కుమార్ వివరించారు.
దేశంలోనే తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని.. రాష్ట్రంలో అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అంజనీ కుమార్ తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలోనూ పోలీసులు రహదారులపై విధులు నిర్వహించి ప్రజలకు చేదోడువాదోడుగా ఉన్నారని గుర్తు చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Martyrs Day) సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు పోలీసులు రక్తదానం చేశారు.
"పోలీసు సేవల్లో తెలంగాణ ముందుంది. భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా మారాయి. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తోంది." - అంజనీ కుమార్, డీజీపీ
Police Martyrs Day Celebrations :ఆదిలాబాద్‌లో జరిగిన పోలీసుఅమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అమరుల వీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారికి బహుమతులు అందజేశారు. అనంతరం పట్టణంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఎందరో పోలీసుల ప్రాణత్యాగం వల్లే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నక్సల్ రహిత జిల్లాగా మారిందని, జిల్లా అభివృద్ది జరుగుతుందని ఎస్పీ, కలెక్టర్ పేర్కొన్నారు.