MLAs Poaching Case Accused Investigation: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితుడు రామచంద్రభారతి వాంగ్మూలం కీలకం అవుతుందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన ఆయనే ఎమ్మెల్యేలతో డబ్బుల గురించి మాట్లాడటం, పైలట్ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో.. ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ విషయంలో ఆయనను ప్రశ్నించడంపై సిట్ దృష్టి పెట్టింది. సిట్ ఏర్పాటైన రోజే కేసులోని నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వడంతో దర్యాప్తు ఆరంభించింది. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. సిట్‌లో సభ్యులుగా ఉన్న డీసీపీలు కల్మేశ్వర్, జగదీశ్వర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీరెడ్డి ముగ్గురినీ సుదీర్ఘంగా విచారించారు.
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన భాజపా:ఎమ్మెల్యేలతో ఫాంహౌజ్‌లో బేరసారాల సందర్భంగా నిందితులు చెప్పిన విషయాలపై ప్రశ్నించగా.. చాలావరకు తమకు తెలియదనే సమాధానమే వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో నిందితులు జరిపిన సంభాషణలపై సిట్ ఆరా తీస్తోంది. నిందితుల సెల్‌ఫోన్లను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక అందాక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును నిలిపివేయాలని భాజపా మరోసారి హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తును ఆపాలని భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. హైకోర్టు సింగిల్ బెంచ్‌లో కమలదళం వేసిన పిటిషన్‌పై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఈ కేసును భాజపాపై దుష్ప్రచారానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని పిటిషన్ వేయగా.. ఈ వాదనలపై లోతైన విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరింత సమాచారాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. భాజపా మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.