తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుల నుంచి కీలక సమాచారం..! - MLAs poaching case accused latest news

MLAs Poaching Case Accused Investigation: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులకు పోలీసుల తొలిరోజు విచారణ ముగిసింది. రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్​లో ముగ్గురు నిందితులను విచారించారు. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను ప్రశ్నించింది. ఇవాళ సుమారు 7 గంటల పాటు విచారించిన పోలీసులు.. నిందితుల స్టేట్​మెంట్​ను వీడియో రూపంలో చిత్రీకరించారు.

MLAs Poaching Case Accused Investigation
MLAs Poaching Case Accused Investigation

By

Published : Nov 10, 2022, 5:51 PM IST

MLAs Poaching Case Accused Investigation: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కస్టడీలో భాగంగా చంచల్​గూడ జైలుకు వెళ్లిన మొయినాబాద్ పోలీసులు.. భారీ భద్రత నడుమ రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్​లను రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిని ఎప్పీ కార్యాలయంలోనూ, సింహయాజి, నందకుమార్​లను స్టేషన్​లో విడివిడిగా ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సుమారు 7 గంటల పాటు ఈ ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నించారు.

తెరాస ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి ఫాంహౌజ్​లోని వీడియో, ఆడియో సంభాషణలను నిందితుల ముందు ఉంచి ప్రశ్నించారు. దిల్లీ నుంచి ఎవరి ప్రోద్భలంతో ఇక్కడికి వచ్చారని విచారించారు. వీడియోలో రికార్డయిన పలువురు ప్రముఖులకు నిందితులకు సంబంధం ఏంటి అనే కోణంలో పోలీసులు వారిని ఆరా తీశారు. పార్టీలో చేరితే డబ్బుతో పాటు పలు అంశాలపై చర్చించిన ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సింహయాజి, నందకుమార్​లతో రామచంద్రభారతికి ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు.

గోప్యంగా విచారణ: నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలోనే పోలీసుల విచారణ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులను 5గంటల వరకూ ప్రశ్నించారు. కస్టడీ రేపటితో ముగుస్తుండటంతో ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈ కేసులో మరికొందరి పాత్ర ఉంటే వారికి కూడా నోటిసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

మరోసారి విచారించే అవకాశం: మరోవైపు రేపు నిందితుల బెయిల్ పిటిషన్​పై నాంపల్లి అనిశా కోర్టులో విచారణ జరగనుంది. రామచంద్రభారతి, సింహయాజిలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని.. వారికి బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కేసు తీవ్రతను బట్టి ఇందులో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ఆ పిటిషన్​లో పేర్కొన్నారు. కాబట్టి నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు అందులో తెలియజేశారు. దీనిపై రేపు వాదనలు జరగనున్నాయి. అటు ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను నిలుపుదల చేయాలని భాజపా ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.

ఇవీ చదవండి:'ఎమ్మెల్యేల ఎర కేసు'.. దర్యాప్తు నిలిపివేయాలంటూ మరోసారి హైకోర్టుకు భాజపా

పోలీసు కస్టడీలో 'ఎమ్మెల్యేలకు ఎర కేసు' నిందితులు

'మతం మారిన దళితులకు ఎస్సీ హోదా'... కేంద్రం ఏం చెప్పిందంటే?

ABOUT THE AUTHOR

...view details