Rayadurgam Kidnapping Case : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ కిడ్నాప్ కేసును 48 గంటల్లో రాయదుర్గం పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరోకరు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ ఇన్‌ఛార్జి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 7 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైనా సురేశ్‌పై గతంలో 21 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పీడీ యాక్ట్ కింద నిందితులపై కేసు చేసి నమోదు చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..నల్గొండ జిల్లాకు చెందిన గుర్రం సురేంద్ర కేపీహెచ్‌బీలో(KPHB) నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఏడు గంటలకు తన బాబాయి కూతురితో కలిసి నగరంలోని ఖాజాగూడ చెరువు దగ్గరకు సరదాగా వచ్చారు. అప్పటికే అక్కడ పాత నేరస్థుడు, మెహదీపట్నం భోజగుట్టకు సురేశ్‌తోపాటు మరో నలుగురు కిడ్నాపర్లు ఎదురుచూస్తున్నారు.
వారు సురేంద్రతో మాట్లాడుతున్నట్లుగా నటించి బలవంతంగా కారులోకి ఎక్కించారు. నిందితులు సురేంద్రను చితకబాదుతూ ఔటర్ మీదుగా నగరం దాటేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ చేరుకోగానే కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న కారు చెడిపోయింది. నిందితులు మరో కారు కోసం సురేంద్రతో అతని భార్యకు ఫోన్ చేయించారు. కడ్తాల్ దగ్గర కారు ఆగిందని వెంటనే మరో వాహనం పంపించాలని కోరారు.
'బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించాం'
Kidnapping Case :ఈ విషయం పోలీసులకు, ఇతరులకు చెబితే ఆత్మహత్య చేసుకుంటానని సురేంద్రతో చెప్పించినట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద దట్టమైన అటవీప్రాంతంలో అర్థరాత్రి వేళ బైర్లూటీ చెక్‌పోస్టుకు సమీపంలో ఒక కారు ప్రధానదారిలో కాకుండా మరో మార్గంలో వెళ్లడాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బందిగుర్తించారు.
వెంటనే వాహనాన్ని ఆపేందుకు యత్నించగా వారు వేగంగా ముందుకు వెళ్లడంతో సిబ్బంది అప్రమత్తమై కారును కొద్దిదూరం వెంబడించారు. ఓ మలుపు దగ్గర నిందితులు కారు వెనక్కి తిప్పి పారిపోయే సమయంలో బారికేడ్లను ఢీకొట్టి ఆగింది. సిబ్బంది అడ్డగించి ప్రశ్నిస్తుండగా వెనక నుంచి కిడ్నాప్ చేశారంటూ సురేంద్ర గట్టిగా కేకలు వేశాడు.