Fake Call Center Case Update: హైదరాబాద్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ముఠా ప్రధాన నిందితుడు సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. అతను 2008 నుంచి ఏడాది పాటు ఎల్ఐసీ ఏజెంట్‌గా.. ఆ తర్వాత ప్రముఖ కార్పొరేట్ బ్యాంకులో వరకు పని చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ అనుభవంతోనే మోసాలకు తెరలేపాడని వెల్లడించారు.
కాల్ సెంటర్ ఏర్పాటు చేసి.. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి: అందుకోసం తన స్నేహితులు శ్రావణ్, గణేశ్‌తో కలిసి పంజాగుట్టలో ఓ ఇంటికి నెలకు రూ.లక్షా 30 వేలు అద్దెకు తీసుకున్నాడు. తెలంగాణకు చెందిన యువతను టెలీకాలర్స్‌గా తీసుకున్నా.. మోసగించినా పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే ఉద్దేశంతో చక్రధర్ కొత్త ఎత్తుగడ వేశాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన యువతీ, యువకులకు నెలకు రూ.15 నుంచి 25 వేల వేతనం ఇచ్చి సుమారు 32 మందిని టెలీకాలర్స్‌గా నియమించుకొని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.
కేసులో ప్రధాన నిందితుడు చక్రధర్ గౌడ్ మోసాలు చేయడంలో ఆరితేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2006లో సిద్ధిపేటలో దొంగనోట్ల తయారీ కేసు నమోదు కాగా.. 2014లో డేటా ఎంట్రీ జాబ్ ఇస్తామంటూ ముగ్గురి నుంచి రూ.3 లక్షల 30 వేలు దండుకున్నాడు. ఆ తర్వాత లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నాడు. ఇటీవల ఓ వివాహితపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని వివరించారు.
పథకం ప్రకారం నిందితుడు నిరుద్యోగులను మోసం: నిరుద్యోగులను మోసం చేయాలని భావించి 2018లో.. మోసాలకు తెర తీశాడు. అందుకోసం ఒక కార్యాలయం ఏర్పాటు చేశాడు. పథకం ఫలించకపోవడంతో కార్యాలయం మూసివేశాడు. 2020లో మరోసారి మోసాలు చేసేందుకు పథకం వేశాడని పోలీసులు తెలిపారు. 2001 నుంచి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు వివరించారు. లక్ష్యంగా చేసుకున్న వారితో 45 రోజుల్లో కార్యకలాపాలు ముగించి.. తమ వద్ద ఉన్న సిమ్ కార్డులను విరగొట్టి పారేస్తాడని చెప్పారు.