తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్చరిస్తారు.. ఆపదలో ఉంటే తోడుంటారు - telangana news

కరోనా కష్టంలో మేము మీవెంటే... అంటూ అండగా నిలుస్తున్నారు పోలీసులు. ఓ వైపు లాక్‌డౌన్‌ అమలులో తీరికలేకుండా ఉన్నా సేవలోనూ వారు ముందంజలో ఉన్నారు. వైద్యం అందడం గగనంగా మారిన స్థితిలో పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న పలు కేంద్రాలు బాధితులకు భరోసా ఇస్తున్నాయి. ఆహారం నుంచి అంబులెన్సుల దాకా వారు అందిస్తున్న సేవలు శెభాష్‌ అనిపించుకుంటున్నాయి. మహానగర పరిధిలోని సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అందిస్తున్న సేవల వివరాలు ఇవీ...

police-helping-centers-for-corona-patients-in-telangana
నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్చరిస్తారు.. ఆపదలో ఉంటే తోడుంటారు

By

Published : May 24, 2021, 7:47 AM IST

  • ఆక్సిజన్‌ అవసరం ఉన్నవారి కోసం ‘ఆక్సికేర్‌ సెంటర్‌’ను ప్రారంభించారు. దీనిద్వారా కొవిడ్‌ నుంచి కోలుకుని ఇంకా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి సేవలు అందించనున్నారు. రాయదుర్గంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో దీనిని ప్రారంభించారు. ఈ కేంద్రంలో 200 పడకలు ఉంటే అందులో 50 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లు ఏర్పాటు చేసి ఉచిత సేవల్ని అందించనున్నారు. ఇక్కడ 15 మంది వైద్యులు, 40 మంది నర్సులు పనిచేస్తున్నారు. ఫోన్‌ : 080-45811138.
  • న్యాక్‌లో హార్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ఆధ్వర్యంలో 100 పడకల ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఇటీవలే ఏర్పాటుచేశారు. ఎవరైనా పేదలు ఇక్కడ చేరి వైద్యుల తోడ్పాటుతో వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఫోన్‌: 9490617440.
  • తల్లిదండ్రులు కొవిడ్‌తో ఆసుపత్రి పాలైతే వారి పిల్లలు ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తోంది. అటువంటి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 6 ఏళ్ల నుంచి 15 ఏళ్ల చిన్నారులకు ఆశ్రయం కల్పించడానికి మాదాపూర్‌, కేబీపీహెచ్‌బీలో రెండు సంరక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఇక్కడ ఆహారం, వసతి, వైద్య, మానసిక వైద్య సేవలు అందిస్తారు. తల్లిదండ్రులతో వీడియో కాల్స్‌లో మాట్లాడిస్తారు. ఫోన్‌: 08045811138.
  • ఒంటరిగా ఉండే చిన్నారులకు దన్నుగా నిలిచేందుకు ఛైల్డ్‌ కేర్‌ రెస్పాన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. బాధితులు ఫోన్‌ చేస్తే పిల్లల వైద్యులు, కౌన్సిలర్ల సహాయంతో కౌన్సెలింగ్‌ ఇప్పించి ధైర్యం చెబుతారు. ఫోన్‌: 08045811215.
  • ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తోడ్పాటుతో టెలిమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. దీనికి 80 మంది వైద్యులు సహకరిస్తున్నారు. ఈ కేంద్రానికి కొవిడ్‌ బాధితులు ఫోన్‌ చేస్తే చాలు వారి పరిస్థితిని తెలుసుకుని వైద్యపరంగా అన్ని రకాల చేయూత ఇస్తారు. ఏ మందులు వాడాలి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది వివరిస్తారు. ఫోన్‌: 08045811138.
  • అంత్యక్రియలు ఖరీదైన వ్యవహారంగా మారిన నేపథ్యంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సహకారంతో మూడు అంబులెన్సులను ఏర్పాటుచేశారు. పేదలకు చేయూత అందించే కృషిలో భాగంగా కోరిన వారి బంధువుల మృతదేహాలకు అంత్యక్రియలు చేయించడంలో సహకరిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఫోన్‌: 9490617440.
  • 12 ఉచిత అంబులెన్స్‌లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. కొవిడ్‌, సాధారణ రోగులనూ ఆసుపత్రులకు తరలించేందుకు వినియోగిస్తారు. 9490617431 నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకువస్తారు.
  • సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూం వివిధ స్వచ్ఛంద సంస్థలు, అవసరార్థుల మధ్య వారధిగా పనిచేస్తుంది. ఎస్‌ఎస్‌సీ వాలంటీర్లు రాత్రింబవళ్లు ఆ కంట్రోల్‌ రూంలో అందుబాటులో ఉంటారు. ఇక్కడికి ఫోన్‌ చేస్తే చాలు అన్ని రకాలుగా సహకరిస్తారు. ఫోన్‌: 9490617440.

వేలమంది ఆకలి తీర్చారు..

రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఆధ్వర్యంలో పేదలకు ఉపయోగపడేలా పలు ఏర్పాట్లు చేశారు.

  • అంత్యక్రియలకు ఉపయోగపడేలా ఫీడ్‌ ది నీడ్‌ సంస్థతో కలిసి నాలుగు అంబులెన్సులను ఏర్పాటుచేశారు. రాచకొండ కమిషనరేట్‌లోని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబరు 9490617234ను సంప్రదిస్తే చాలు ఈ అంబులెన్సులు ఆసుపత్రికి వచ్చి మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకువెళతాయి. నెలన్నర రోజులుగా వందల సంఖ్యలో దహన సంస్కారాలకు సహకరించారు.
  • లాక్‌డౌన్‌ వేళ చాలా మంది వృద్ధులు, గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసం మహేంద్ర ఎలైట్‌, శ్రీనివాసా టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థల తోడ్పాటుతో ఆరు క్యాబ్లను ఏర్పాటు చేశారు. అవసరం ఉన్న వాళ్లు రాచకొండ కొవిడ్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే ఈ వాహనం వచ్చి సంబంధితులను ఆస్పత్రులకు తీసుకువెళ్లి తీసుకువస్తాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు.
  • కరోనా నేపథ్యంలో వేలాది మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమందిలో ఇది తీవ్రమై ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో కమిషనరేట్‌లో 14 మంది మానసిక శాస్త్రవేత్తలతో కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇది పని చేస్తోంది. 04048214800 నంబర్‌కు ఫోన్‌ చేసి మానసికంగా కుంగుబాటులో ఉన్న వారు వైద్యుల సలహాలు పొందొచ్చు. ఇప్పటికి మూడు వేల మంది ఇక్కడకు ఫోన్‌ చేసి మనోధైర్యం పొందారు.
  • కమిషనరేట్‌ పరిధిలోని అనేక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోని వెయ్యి మందికి పైగా ఆకలి బాధలు అనుభవించడంతో పోలీసులు స్పందించారు. హరియాణా నాగరిక్‌ సంఘ్‌ సంస్థ తోడ్పాటుతో రోజూ ఉదయం రాత్రి వీటిలో ఉన్న అందరికీ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. జాతీయ రహదారులపై హోటళ్లు మూతపడటంతో వేల మంది లారీ డ్రైవర్లు ఆకలి బాధలు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంతంగి టోల్‌ గేట్‌, ఓఆర్‌ఆర్‌ ఘట్‌కేసర్‌ జంక్షన్‌, బీబీనగర్‌ గూడూరు టోల్‌గోట్‌ దగ్గర దాదాపు వెయ్యిమందికి పైగా ప్రతి రోజూ రెండు పూటలా భోజనాలు పంపిణీ చేస్తున్నారు.
  • 50 ఆక్సిజన్‌ సిలిండర్లు, 10 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను సమకూర్చుకుని కమిషనరేట్‌లోని పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో సామాన్యులకు విస్తరించే విషయంపై యోచిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌ దత్తత తీసుకున్న రాచకొండ తండాలో 25 మంది కరోనా బారినపడితే వారికి మందులు, వైద్య సహాయం అందించడమే కాకుండా నెలకు సరిపడా అన్ని రకాల వస్తువులను వీరికి అందజేశారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో...

  • హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కొవిడ్‌ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఫోన్‌ చేస్తే చాలు అన్ని రకాలుగా చేయూత ఇస్తున్నారు. రక్తం అవసరం ఉన్నా, ఆహారం కావాల్సినా అందజేస్తున్నారు. నగర పోలీసుల కోసమే ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫోన్‌: 04048213345.
  • మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో హోం ఐసొలేషన్‌లో ఉన్న దాదాపు నాలుగువేల మందికి ప్రతి రోజూ ఇంటికే ఆహారాన్ని అందజేస్తున్నారు. ఫోన్‌: 7799616163.

ABOUT THE AUTHOR

...view details