తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 2:26 PM IST

ETV Bharat / state

అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలో ఉల్లంఘనలు

ఆంధ్రప్రదేశ్​ విశాఖలోని చుక్కవానిపాలెంలో అమ్మోనియం నైట్రేట్‌ గోదాములు నిర్వహిస్తున్న శ్రావణ్‌ షిప్పింగ్‌ సంస్థకు పోలీసులు తాఖీదులు జారీ చేశారు. ‘అమ్మోనియం నైట్రేట్‌ నిబంధనలు-2012’ ఉల్లంఘించారని సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా ఆధ్వర్యంలో పోలీసు అధికారులు నిర్వహించిన దర్యాప్తులో తేలింది. దీంతో ఆయా ఉల్లంఘనలన్నింటితో సమగ్ర నివేదిక తయారు చేశారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కోరారు.

ammonia
అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలో ఉల్లంఘనలు

పోలీసుల దర్యాప్తులో గుర్తించిన అంశాలివే:

  • అమ్మోనియం నైట్రేట్‌ ఉన్న గోదాములు రక్షిత ప్రదేశాలకు కనీసం 90 మీటర్ల దూరంలో ఉండాలి. వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
  • గోదాముల ప్రాంగణంలో గోదాముకు గోదాముకు మధ్య కనీసం 9 మీటర్ల దూరం ఉండాలి. ఆ ప్రాంగణంలో మొత్తం పది గోదాములు ఉండగా వాటి మధ్య దూరం తొమ్మిది మీటర్లలోపే ఉంది. సి9, సి10 రెండు గోదాములుగా చూపినప్పటికీ క్షేత్రస్థాయిలో అది ఒకే గోదాముగా ఉన్నట్లు గుర్తించారు. ఒకగోడ కట్టి రెండు గోదాములుగా చూపినట్లు తేల్చారు. సీ5, సీ6 గోదాముల మధ్య దూరం కేవలం 2.3 మీటర్లే ఉన్నట్లు నిర్దారించారు. కనీసం అగ్నిమాపకశకటం కూడా కొన్నిచోట్లకు వెళ్లే పరిస్థితి లేదని తేల్చారు.
  • వాస్తవానికి ఒక్కోచోట ఒక్క గోదాముకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉండగా ఏకంగా పది గోదాములున్న ప్రాంగణానికి అనుమతి ఇచ్చారు.
  • పెసో(పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ) అధికారులు ఆయా గోదాముల్లో అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేయడానికి అనుమతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్దమేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పెసో అధికారులకు సమాచారం ఇచ్చారు.
  • ఒక చదరపు మీటరు విస్తీర్ణానికి ఒకటన్ను మాత్రమే అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేయాల్సి ఉండగా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు.
  • గోదాము విస్తీర్ణంతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి గోదాముకు 5 వేల మెట్రిక్‌టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు.
  • జీవీఎంపీ, ట్రాఫిక్‌ పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఆర్డీవో, అగ్నిమాపకశాఖల అధికారులు అనుమతులు ఇచ్చారు. పోలీసులకు పంపాల్సిన నెలవారీ నివేదికలను కూడా పంపలేదు.
  • గోదాముల్లో 20వేల టన్నులకు మించి సరకు నిల్వ ఉంచకూడదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదు.

భద్రత ప్రమాణాలన్నీ పాటించాం

కేంద్ర ప్రభుత్వ భద్రతా ప్రమాణాల మేరకే గోదాములను నిర్వహిస్తున్నాం. అధికారులు పరిస్థితులను చూసిన తర్వాతే మాకు అనుమతులు ఇచ్చారు. పోలీసుల నుంచి అందిన నోటీసులకు సమాధానం పంపుతాం.

- జి.సాంబశివరావు, అధినేత, శ్రావణ్‌ షిప్పింగ్‌ సంస్థ

ఇదీ చూడండి:అమ్మోనియం నైట్రేట్ బస్తాలను తరలిస్తున్న నిందితుడు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details