చైనా సరిహద్దులో 1959లో పోలీసుల త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న దేశమంతటా సంస్మరణ దినోత్సవం(Police flag day) నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ గోషామహల్‌లో గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బలంగా పనిచేస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికత, సీసీ కెమెరాలు, వాహనాల అందజేతతో సర్కారు అండగా నిలుస్తోందన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మహమూద్ అలీ అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనకాడరని.. అమరులైన పోలీసులు మనకు, సమాజానికి నిరంతరం గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారంతో సాంకేతికతను వినియోగించి పోలీసు సేవలలో నాణ్యతను పెంచడానికి నిరంతర కృషి జరుగుతున్నది. పోలీసు అమరవీరుల త్యాగాలను మరొక్కసారి స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. -మహేందర్ రెడ్డి, డీజీపీ
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి..
జిల్లాల్లోనూ పోలీసు అమరవీరులకు అధికారులు, పోలీసు కుటుంబ సభ్యులు శ్రద్ధాంజలి(Police flag day) ఘటించారు. ఆదిలాబాల్‌లో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు బహుమతులు అందించారు. నిజామాబాద్‌లో పోలీసు కమిషనర్ కార్తికేయ, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా అమరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నిర్మల్ , సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అమరవీరుల త్యాగాలను పోలీసు శాఖ స్మరించుకుంది. అమరుల స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో.. శాంతి భద్రతల పరిరక్షణకు పోరాడతామని చెప్పారు.