తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కారు పాస్‌ స్టిక్కర్ ఇక ఎవరు పడితే వారు వాడలేరు! - MLA car pass‌ stickers latest news

MLA car pass‌ stickers: ఎమ్మెల్యే కారు పాస్‌ స్టిక్కర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు పోలీస్​శాఖ నడుంబిగించింది. ఎవరు పడితే వారు వీటిని వినియోగించకుండా, నకిలీవి సృష్టించకుండా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని శాసనసభ స్పీకర్‌ పరిశీలన కోసం పంపింది.

MLA car pass stickers
ఎమ్మెల్యే కారు పాస్‌ స్టిక్కర్ల

By

Published : Apr 10, 2022, 8:05 AM IST

MLA car pass‌ stickers: ఎమ్మెల్యే కారు పాస్‌ స్టిక్కర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు పోలీస్​శాఖ చర్యలు చేపట్టింది. గత నెలలో హైదరాబాద్‌ దుర్గం చెరువు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతికి కారణమైన వాహనంపై బోధన్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వాహనం బోధన్‌ ఎమ్మెల్యే సమీప బంధువుదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఎవరుపడితే వారు ఎమ్మెల్యే స్టిక్కర్లు వాడుతుండటం విమర్శలకు దారితీసింది.

రంగంలోకి దిగిన హైదరాబాద్‌ పోలీసులు ద్విచక్ర వాహనాలు, కార్ల నంబర్‌ ప్లేట్లు, అద్దాలపై ఉన్న రాతలు, స్టిక్కర్లను తొలగించడం మొదలుపెట్టారు. హోదా, వృత్తిని సూచించే ఈ రాతల ద్వారా పరోక్షంగా ఎదుటివారిని, ముఖ్యంగా ట్రాఫిక్‌ పోలీసులను ప్రభావితం చేస్తున్నారని, రవాణా చట్టం ప్రకారం ఇలాంటి రాతలు నిషిద్ధమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి రాతలు, స్టిక్కర్లు ఉన్న వాహనాలకు జరిమానాలు సైతం విధిస్తున్నారు.

ప్రతి ఎమ్మెల్యేకు ఆరు నెలలకు మూడు స్టిక్కర్లు

ప్రతి ఎమ్మెల్యేకు ఆరు నెలలకు ఒకసారి మూడు కార్‌ పాస్‌ స్టిక్కర్లు ఇస్తుంటారు. అంటే మూడు వాహనాలకు వీటిని అతికించుకోవచ్చు. కొంతమంది స్టిక్కర్లు పోయాయని చెబుతూ అదనంగా తీసుకుంటున్నారని.. కొందరు ఎమ్మెల్యేల అనుచరులు నకిలీవి తయారుచేసి తమ వాహనాలకు అతికిస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ స్టిక్కర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలని అధికారులు నిర్ణయించారు. అందుకనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఎమ్మెల్యేకి స్టిక్కర్లు ఇచ్చేటప్పుడు వాటిపై వాహనాల నంబర్లు, కాలపరిమితిని సైతం ముద్రించాలని ప్రతిపాదించారు. ప్రతి స్టిక్కర్‌పై బార్‌కోడ్‌ ముద్రించాలని, అందులో స్టిక్కర్‌ ఎవరికి జారీ చేశారనే వివరాలతోపాటు మిగతా రెండు స్టిక్కర్లు, వాటి వాహనాల నంబర్లు ఉండేలా చూడాలనేది మరో ప్రతిపాదన. ఎవరైనా దొంగ స్టిక్కర్లు పెట్టుకున్నా బార్‌కోడ్‌ ద్వారా గుట్టు రట్టు చేయొచ్చనేది పోలీసుల ఆలోచన. ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలగకుండా చూడటంతోపాటు వారి పేరు దుర్వినియోగం కాకుండా చూడటమే తమ ఉద్దేశమని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఆ పాఠశాలల్లో చదువుకున్న వారు టీఎస్‌పీఎస్సీకి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి!

ABOUT THE AUTHOR

...view details