custody of accused in paper leakage case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఏఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యలకు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులను 6 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరినప్పిటికీ... కోర్టు 3రోజులకు అంగీకరించింది.
డాక్యా, రాజేశ్వర్ నాయక్ నుంచి ప్రశాంత్, రాజేందర్ ఏఈ ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు. తిరుపతయ్య దళారిగా వ్యవహరించి ఏఈ ప్రశ్నాపత్రం విక్రయించినట్లు తేలింది. ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీలో మరికొంత సమచారం వచ్చే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రశాంత్, రాజేందర్ ఇంకవెరికైనా ప్రశ్నాపత్రాలను విక్రయించారా అనే కోణంలో ప్రశ్నించనున్నారు.
TSPSC Paper Leakage updates ఇక ఇదిలా ఉంటే... ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ బృందం... నేరుగా ఛైర్మన్ గదికి వెళ్లారు. దాదాపు 3 గంటల పాటు జనార్దన్ రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. టీఎస్ పీఎస్సీ కార్యకలాపాలు, ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రశ్నాపత్రాలు రూపొందించే విధానం, వాటిని భద్రపరిచే తీరు, పరీక్షల నిర్వహణ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.