తెలంగాణ

telangana

ETV Bharat / state

Telugu Academy Case: 'నిర్లక్ష్యమే కొంపముంచింది..' నిధుల గోల్​మాల్​పై సర్కార్​కు నివేదిక - telugu academy golmal case

telugu academy
తెలుగు అకాడమీ

By

Published : Oct 5, 2021, 6:02 PM IST

Updated : Oct 6, 2021, 12:16 AM IST

17:59 October 05

తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేశ్ అరెస్టు

    తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్​మాల్ కేసు(Telugu Academy Deposits Case)లో యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ(Ubi Manager Mastan Vali)ని మూడు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం (Nampalli Court) అనుమతించింది. మరో ముగ్గురు నిందితులైన సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్​ల కస్టడీపై తీర్పును గురువారానికి వాయిదా వేసింది. మస్తాన్ వలీని రేపటి నుంచి కస్టడీలోకి తీసుకొని 6 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. తెలుగు అకాడమీకి సంబంధించిన రూ. 63 కోట్ల డిపాజిట్లు దారి మళ్లించారు.  

ఇందులో యూబీఐ బ్యాంకుకు చెందిన కార్వాన్, సంతోశ్​నగర్ శాఖల్లో రూ. 53 కోట్లను డిపాజిట్ చేశారు. డిపాజిట్లను ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి నగదును తీసుకున్నారు. తెలుగు అకాడమీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు ప్రధాన నిందితుడు మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్​లను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇంకెవరెవరు...

యూనియన్ బ్యాంకు నుంచి డిపాజిట్లను ఏ విధంగా మళ్లించారనే విషయాలు తెలుసుకోవడానికి... నలుగురు నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. డిపాజిట్ల గోల్​మాల్ వెనక ఇంకెవరెవరు ఉన్నారనే విషయాలు తెలుసుకొవాల్సింది ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మస్తాన్ వలీని ఆరు రోజుల కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. యూబీఐతో పాటు చందానగర్​లోని కెనరా బ్యాంకులోనూ (Canara Bank) రూ. 10 కోట్ల డిపాజిట్లను ఏపీ మర్కంటైల్ ఖాతాకు మళ్లించారు. ఈ రెండు బ్యాంకుల్లో ఒకే ముఠా పనిచేసిందా... ఈ ముఠా వెనక కీలక పాత్ర పోషించిన వాళ్లెవరనే కోణంలో పోలీసులు మస్తాన్ వలీని ప్రశ్నించనున్నారు.

ప్రభుత్వానికి నివేదిక...  

తెలుగు అకాడమీ నిధుల గోల్​మాల్(Telugu Academy Deposits Case)​పై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక (Report For Government) సమర్పించింది. కమిటీకి నేతృత్వం వహించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు నివేదిక సమర్పించారు. బ్యాంకుల్లో ఫిక్స్​డ్ డిపాజిట్లు గల్లంతుపై సీసీఎస్ పోలీసులు (Ccs Police) ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శాఖపరమైన అంతర్గత లోపాలపై విచారణ జరిపేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి సహా అధికారులు, సిబ్బందిని, బ్యాంకు అధికారులను విచారించిన కమిటీ... ప్రాథమిక నివేదికను ఇవాళ సమర్పించింది.

ఫిక్స్​డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల నిర్వహణలో శాఖాపరమైన నిర్లక్ష్యం జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు సమాచారం. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా ఆర్థిక లావాదేవీలు జరపడం, అకౌంట్స్ విభాగం, ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. అకాడమీ డైరెక్టర్​గా సోమిరెడ్డిని ఇప్పటికే బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం.. పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ దేవసేనను నియమించింది.

కెనరా బ్యాంక్ అధికారులపై...

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్​మాల్ కేసు(Telugu Academy Deposits Case)లో చందానగర్ కెనరా బ్యాంకు (Canara Bank) అధికారులను సీసీఎస్ పోలీసులు (Ccs Police) ప్రశ్నిస్తున్నారు. చిన్నమొత్తంలో ఉండే నగదు చెల్లించే సందర్భంలోనూ సంతకాలను పోల్చుకునే బ్యాంకు సిబ్బంది... తెలుగు అకాడమీ విషయంలో ఎందుకు నిర్లిప్తత వహించారని కెనరా బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. తెలుగు అకాడమీ ఏ బ్యాంకులో అయితే డిపాజిట్ చేసిందో... అదే బ్యాంకులోని ఖాతాలో మాత్రమే డిపాజిట్​ను నగదుగా జమ చేయాల్సి ఉన్నప్పటికీ... ఈ నిబంధనను ఎందుకు పాటించలేదని బ్యాంకు అధికారులను సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు.  

కేవలం లేఖల ఆధారంగా కోట్ల రూపాయల నగదును వేరే బ్యాంకు ఖాతాలోకి మళ్లించడాన్ని బ్యాంకు అధికారుల వద్ద పోలీసులు ప్రస్తావించారు. తెలుగు అకాడమీ అధికారుల పేరుతో వచ్చిన లేఖలను నమ్మి.... డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాలో జమ చేసినట్లు కెనరా బ్యాంకు అధికారులు తెలిపారు. రూ. 63కోట్లను డిపాజిట్ చేసినప్పుడు... కనీసం బ్యాంకుకు వెళ్లకుండా కేవలం ఏజెంట్ల మీద ఎందుకు ఆధారపడ్డారని తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్​ను పోలీసులు ప్రశ్నించారు. తెలుగు అకాడమీకి చెందిన నగదును.. బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించే ఏజెంట్లే ఈ మోసానికి తెరలేపారా లేకపోతే వీళ్ల వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేశ్ అరెస్టు

   తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేష్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు అరెస్టయ్యారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో తెలుగు అకాడమీకి చెందిన ఉద్యోగితో పాటు మరో ముగ్గురు ఉన్నారు. వీరిని రేపు అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేష్‌ .. నిధుల గోల్‌మాల్‌ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిధులు బ్యాంకుల నుంచి మళ్లిస్తు్న్నా.. అకౌంట్స్‌ అధికారిగా మీరు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? అని పోలీసులు రమేశ్​ను ప్రశ్నించినట్టు సమాచారం. కోర్టు అనుమతితో రేపటి నుంచి యూబీఐ బ్యాంకు మేనేజర్‌ మస్తాన్‌వలీని పోలీసులు కస్టడీలో తీసుకొని నిధుల స్వాహా కేసులో లోతుగా విచారించనున్నారు. ఇతర నిందితుల పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు రేపు నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత కథనాలు..

Last Updated : Oct 6, 2021, 12:16 AM IST

ABOUT THE AUTHOR

...view details