Police Crackdown on Drug Trafficking: హైదరాబాద్‌లో మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మూడు కమిషనరేట్ల సీపీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మత్తుకు అలవాటుపడి విక్రేతలుగా మారిన వారి జాబితా సేకరిస్తున్నారు. మారుపేర్లతో తప్పించుకుంటున్న ప్రధాన సూత్రదారులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. నగరంలోని కొన్ని పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్స్, వ్యాయామ కేంద్రాల్లో ఎనర్జీడ్రింక్స్, ప్రొటీన్స్ పేరుతో అక్కడికి వచ్చే వారికి మాదకద్రవ్యాల రుచి చూపుతున్నారా! అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.
దొరికితే అంతే..బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్‌లోని కొన్ని వ్యాయామ కేంద్రాలపై ఆరోపణలు రావటంతో నిర్వాహకులను పోలీసులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. అక్కడకు వచ్చే యువతీయువకుల వివరాలు, ఆధార్‌కార్డు నెంబర్లతో సహా రికార్డులో నమోదు చేయాలని సూచించినట్టు సమాచారం. పట్టుబడిన వారి సెల్‌ఫోన్ల నుంచి విక్రేతలు, వినియోగదారుల సమాచారం రాబట్టి హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ వినియోగిస్తూ దొరికితే ఉద్యోగం ఊడటమే గాకుండా జైలు ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుందని ఘాటుగానే హెచ్చరిస్తున్నారు.