తెలంగాణ

telangana

ETV Bharat / state

Fake seeds: నకిలీ విత్తనాల విక్రేతలపై పోలీసుల ఉక్కుపాదం - Telangana news

నకిలీ విత్తనాల (Fake seeds) విక్రేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్తంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ (Task force)లు ఏర్పాటు చేసి ఎరువుల దుకాణాలపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాలు ఉన్నట్లు తేలితే... సదరు వ్యాపారులపై పీడీ (Pd) చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు. గత ఆరేళ్లలో 27 మంది విత్తనాల వ్యాపారులపై పీడీ (Pd) చట్టం కింద కేసు నమోదు చేశారు.

police
నకిలీ విత్తనాలు

By

Published : Jun 6, 2021, 5:02 AM IST

వ్యవసాయ సీజన్ ఆరంభం కావడంతో నకిలీ విత్తనాల (Fake seeds)ను అరికట్టేందుకు పోలీసులు నడుం బిగించారు. విత్తనాల వ్యాపారులపై నిఘా పెట్టి ఉంచారు. గతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ అరెస్టయిన వ్యాపారుల వివరాలు సేకరించి పెట్టుకున్నారు. ఈ సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ విత్తనాల విక్రయాలుండొద్దని సీఎం కేసీఆర్ (Cm kcr) వ్యవసాయ, పోలీసు శాఖలను ఆదేశించారు.

రెండు శాఖలు...

రెండు శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ కమినషర్ రఘునందన్ రావుతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరు శాఖల అధికారులు ఎలా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని కార్యాచరణ రూపొందించారు. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలనే దానిపై పోలీసులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించారు.

టాస్క్​ఫోర్స్ కమిటీలు....

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్​ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేస్తున్నారు. పోలీసులకు వచ్చే సమాచారం ఆధారంగా పలు ఇళ్లల్లోనూ దాడులు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు ఉన్నట్లు తేలితే వెంటనే వ్యవసాయశాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు... చట్టప్రకారం వ్యాపారిపై కేసు నమోదు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులను అధిక ధరకు విక్రయించినా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

అనుమతి లేకుంటే చర్యలు...

గుర్తింపులేని విత్తనాలను విక్రయించినా, ప్యాకెట్లలో లేబుల్ వేయకుండా విడివిడిగా విత్తనాలు అమ్మినా కేసులు నమోదు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అనుమతి లేకుండా ఫెర్టిలైజర్ దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణానికి హాని చేకూర్చే బీజీ-3 పత్తి విత్తనాలు, నిషేధిక రసాయన మందులు విక్రయించే వ్యాపారులపై కేసులు పెడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 87 కేసులు నమోదు చేసి 134 మంది నకిలీ విత్తనాల విక్రేతలను అరెస్ట్ చేశారు. 852 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆరేళ్లలో 27 మంది వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైళ్లు, లారీల ద్వారా నకిలీ విత్తనాలు తీసుకొచ్చే అవకాశం ఉండటంతో... వాటిపైనా పోలీసులు నిఘా పెంచారు. సరిహద్దు జిల్లాల్లోనూ నిఘా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

విస్తృతంగా తనిఖీలు...

నకిలీ విత్తనాల కట్టడికి పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత విత్తనాలు, రసాయనాలు విక్రయిస్తున్న వారిని, తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నారాయణపేట పట్టణ కేంద్రంలో అశోక్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఇంట్లో 64 కేజీల లూజ్ పత్తి విత్తనాలు, 110 ప్యాకెట్‌ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో వ్యక్తి ఇంట్లోనూ లూజ్ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బురుగుడా గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 2 లక్షల 40 వేల విలువైన 120 కిలోల పత్తి విత్తనాలను అధికారులు సీజ్‌ చేశారు. పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:Tammineni: 'ఈటల.. భాజపా పంచన చేరటం సిగ్గుచేటు'

ABOUT THE AUTHOR

...view details