కొద్దిరోజుల క్రితం పశ్చిమ మండల ఠాణాకి వచ్చిన వైద్యురాలికి ‘న్యాయం’ చేస్తామంటూ ఇద్దరు మధ్యవర్తులు, పోలీస్ అధికారి చెప్పారు. ఆమెకు అన్యాయం చేసిన చిత్రకారుడినుంచి రూ.1.50 కోట్లు ఇప్పిస్తామని, అందుకు తమకు రూ.15 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మధ్యవర్తులు, పోలీస్ అధికారిపై ఆమెకు అనుమానం రావడంతో విషయం బహిర్గతమైంది. దీంతో ఆమెతో పోలీస్ అధికారి రాజీ కుదుర్చుకుని బయానాగా తీసుకున్న రూ.5లక్షలు తిరిగి ఇచ్చేశారు. వైద్యురాలు అప్పటికే నిఘావర్గాలకు సమాచారమివ్వడంతో ఈ వ్యవహారంపై నివేదికను రూపొందించాయి.
బయానా మూడు వాటాలు
వైద్యురాలితో రెండు ఛానెళ్ల విలేకరులు 15 రోజుల క్రితం మాట్లాడారు. ఆమెను ఠాణాకు రప్పించారు. చిత్రకారుడిని భయపెట్టేందుకు కేసు నమోదు చేశామన్నారు. తొలుత రూ.5లక్షలు బయానా ఇవ్వాలని, రూ.1.5కోట్లు చిత్రకారుడు ఇచ్చాక.. రూ.10లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. వైద్యురాలు రెండురోజుల్లో రూ.5లక్షలు తెచ్చివ్వగా.. పోలీస్ అధికారి రూ.2 లక్షలు, ఛానెళ్ల విలేకరులు చెరో రూ.1.5 లక్షలు తీసుకున్నారు. అనంతరం చిత్రకారుడి సన్నిహితులతో మాట్లాడి రూ.1.5 కోట్లు ఇవ్వాలని కోరారు.. వారు ఈ విషయాన్ని చిత్రకారుడికి వివరించారు. ఈమేరకు ఆయన రూ.కోటి ఇస్తానని చెప్పారంటూ సన్నిహితులు పోలీస్ అధికారికి వివరించగా... సరేచూద్దాం.. ముందు దీనికైతే ఒప్పుకోండి అన్నారు. అనంతరం చిత్రకారుడిపై కేసు తీవ్రత తగ్గేలా వైద్యురాలి తరఫున న్యాయస్థానానికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వైద్యురాలు తనకు అన్యాయం జరుగుతోందన్న భావనతో పత్రికలకు సమాచారమిచ్చారు. కథ తిరగబడటంతో ఛానెళ్ల విలేకరులు, పోలీస్ అధికారి వైద్యురాలితో మాట్లాడి రాజీ కుదుర్చుకుందామని చెప్పగా.. ఆమె అంగీకరించలేదు.