తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టు కీలక నేతను వలపన్ని పట్టుకున్న పోలీసులు - గాలికొండ మావో హరి

పోలీసుల దాడులతో ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు తూర్పు డివిజన్ అంతకంతకూ బలహీనపడుతోంది. వందలాది హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్న కీలక నేత గెమ్మెలి కామేశ్ అలియాస్ హరిని భద్రతా బలగాలు పట్టుకున్నాయి. 30 మంది మావోలు హతమైన రామ్​గుడా ఎన్​కౌంటర్ నుంచి గతంలో తప్పించుకోగా.. ఇప్పుడు దొరికిపోయాడు.

మావోయిస్టు కీలక నేతను వలపన్ని పట్టుకున్న పోలీసులు
మావోయిస్టు కీలక నేతను వలపన్ని పట్టుకున్న పోలీసులు

By

Published : Oct 1, 2020, 2:39 PM IST

మావోయిస్టు కీలక నేతను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఏపీ విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం కుంకుమపూడికి చెందిన గెమ్మెలి కామేశ్‌ అలియాస్‌ హరి అలియాస్‌ వసంత అజ్ఞాతంలో ఉండి వందలాది హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. 'గిరిజనుడివై ఉండి గిరిజనులనే హతమారుస్తున్నావు’ అంటూ హరికి వ్యతిరేకంగా గోడప్రతులు వెలిశాయి. మూడేళ్లుగా తూర్పు డివిజన్‌ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో.. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలింపుచర్యలు చేపట్టారు.

కొరకరాని కొయ్య!

గతేడాది మాదిమళ్లు, నేలజర్త వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో హరి హతమయ్యాడనే వదంతులు సంచలనం సృష్టిచాయి. మృతదేహాలు వచ్చిన తరువాత అతడు అక్కడ నుంచి తప్పించుకున్నట్లు తేలింది. ఏవోబీలో సుమారు 30 మంది మావోయిస్టులు బలైన రామ్‌గుడా ఎన్‌కౌంటర్​లోనూ త్రుటిలో బయటపడ్డాడు. తూర్పు డివిజన్‌లో మావోయిస్టులకు కీలకంగా ఉండే గాలికొండ ఏరియా కమిటీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ నేతలు కామేష్​ను ఇక్కడ నియమించారు. అతడి నేతృత్వంలో స్థానిక విభాగం విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించసాగింది. ఒకరకంగా పోలీసులకు హరి కొరకరాని కొయ్యగా మారాడు.

ఎట్టకేలకు...

కామేశ్‌ కదలికలపై దృష్టిపెట్టిన పోలీసులు.. జీకేవీధి మండలంలోని ఓ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. సమయస్ఫూర్తితో వలపన్ని హరిని పట్టుకోగలిగారు. ఈ అరెస్టుతో గాలికొండ ఏరియా కమిటీ మరింత బలహీనమవ్వగా.. తూర్పు డివిజన్‌లో మావోయిస్టుల కదలికల్లో దూకుడు కొంత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:'గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు'

ABOUT THE AUTHOR

...view details