Police Cases Tension in MLA Candidates Telangana :ఎన్నికల వేళ.. పలువురురాజకీయ నేతలకు కేసులభయం పట్టుకుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వారిలో ఇది స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో తమపై ఏ పోలీస్స్టేషన్లో ఏ కేసు నమోదైందో తెలుసుకోవాలన్న విషయంపై నేతలంతా అప్రమత్తమవుతున్నారు. ఇంతవరకు తమపై నమోదైన కేసుల వివరాలు తెలుసుకోవడానికి వాటిని ఇవ్వాలంటూ.. డీజీపీ కార్యాలయానికి వరుస కడుతున్నారు. ఇలాంటి వారిలో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల కేసుల జాబితాను రూపొందించే పనిలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్సీఆర్బీ) (SCRB) నిమగ్నమైంది.
17% అభ్యర్థులు నేరచరితులే: ఏడీఆర్ నివేదిక
సీఐడీ ఆధీనంలో ఉన్న ఈ విభాగానికి ఆయా నేతల వ్యక్తిగత కార్యదర్శులు లేదా అనుచరులు వచ్చి వివరాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతంలో తమపై నమోదు చేసిన కేసులు.. ఇప్పుడు ఏ దశలో ఉన్నాయో తెలపాలని అధికారులను కోరుతున్నారు. తాజాగానమోదైన కేసుల గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. కేసుల విషయంలో మొదట టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా హై కోర్టునే ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుల వివరాలు దాచి పెడుతున్నారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఉన్న కేసుల వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని విన్నవించారు. ఈ క్రమంలో స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను రూపొందించింది. ఇది మొదలు.. చాలా మంది రాజకీయ నేతలు తమ కేసుల వివరాల కోసం డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు.