తెలంగాణ

telangana

ETV Bharat / state

'కౌన్సిలింగ్ అంటే కరెంట్ షాక్ ఇవ్వడమా...?'

కౌన్సిలింగ్​ పేరుతో తెదేపా నేతలను పోలీసులు కొట్టారని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆరోపించారు. ఈ అంశంపై ఎస్పీ సిద్ధార్థ్​ కౌశల్​కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారని రవికుమార్​ తెలిపారు.

current
current

By

Published : Mar 14, 2020, 6:10 PM IST

'మీకెందుకు ఎన్నికలు.. గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోండి'’ అంటూ తమ వారిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల భద్రత కోసం... రౌడీషీటర్ల కౌన్సిలింగ్‌ పేరిట బల్లికురవ మండలంలోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 51 మందిని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి.. వేమవరానికి చెందిన 12 మంది మినహా మిగతావారిని పంపించారని రవికుమార్​ తెలిపారు. అనంతరం తమ అనుచరులను లోపలికి తీసుకెళ్లి చితకబాదారని అన్నారు. బైండోవర్‌ నిమిత్తం తీసుకొచ్చి తమను వేధించిన తీరును వారు ఆయనకు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఘటనపై ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేయగా... ఆయన సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారని, గ్రామంలో బందోబస్తు పెంచి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రవికుమార్‌ ఒంగోలు ఆర్డీవో కార్యాలయం వద్ద బైండోవర్‌ నిమిత్తం తీసుకొచ్చిన తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. పోలీసులు తమను వేధించిన తీరును ఈ సందర్భంగా వేమవరానికి చెందిన పలువురు ఆయనకు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఉదంతంపై ఆర్డీవోకు కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

నామినేషన్లు ఉపసంహరించుకోవాలని...

బల్లికురవ మండలంలో ఎన్నికల సమయంలో రౌడీషీటర్లుగా నమోదైన వారికి ఎన్నికల ప్రత్యేక సీఐ రాజమోహన్‌ శుక్రవారం కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్టేషన్‌కు వచ్చిన రౌడీషీటర్లతో మధాహ్నం మూడు గంటల సమయంలో మాట్లాడారు. అనంతరం వారిని విడిచి పెట్టారు. వేమవరానికి చెందిన తెదేపా సానుభూతిపరులను మాత్రం అక్కడే ఉండాలని చెప్పారు. అనంతరం వారిని స్టేషన్‌ లోపలికి పిలిపించి అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ చిత్రహింసలకు గురి చేశారని... విద్యుత్‌ షాక్‌ ఇచ్చారని ఒంగోలులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆరోపించారు. తెదేపా అభ్యర్థులుగా ఎంపీటీసీ స్థానాలకు పోటీలో నిలిచిన వారందరూ వెంటనే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని.. లేకుంటే గ్రామంలో ఎలా తిరుగుతారో చూస్తామని బెదిరింపులకు గురిచేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు.

చరవాణులు లాగేసుకుని...

ఉదయం తొమ్మిది గంటలకు స్టేషన్‌కు వచ్చిన రౌడీషీటర్లు అందరూ తిరిగి గ్రామం చేరుకున్నారు. వేమవరంవాసులు మాత్రం బయటకు రాలేదు. వారి వద్ద ఉన్న చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆపివేసినట్లు వారి కుటుంబసభ్యులు చెప్పారు. వారి యోగక్షేమాలు తెలియక ఆందోళన చెందాల్సివచ్చిందని, స్థానిక పోలీసులు సరైన సమాచారం అందించకపోవడంతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేకు తెలిపామన్నారు. గొట్టిపాటి మారుతి, మాలెంపాటి కన్నయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్యలను తీవ్రంగా కొట్టిన విషయాన్ని చెప్పామన్నారు. అందరిపై బైండోవర్‌ కేసు నమోదు చేసి, ఒంగోలు ఆర్డీవో కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ఒంగోలుకు చేరుకున్నారు. బాధితులతో కలిసి ఎస్పీ, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details