ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి వద్ద తెదేపా (tdp) నేతల అరెస్టుపై ఆపార్టీ అధినేత చంద్రబాబు (chandrababu)ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతల మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య అని.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా..? అని నిలదీశారు.
వైకాపా నేతలు పంచభూతాలను అడ్డంగా దోచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నిబంధనల ప్రకారం తవ్వకాలు జరిపితే భయమెందుకు అని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు.. గిరిజనుల ఉనికికే ప్రమాదం తలపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు విశాఖ మన్యంలో తవ్వకాలను నిలిపివేయాలన్నారు.
రౌతులపూడి వద్ద తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా బృందం
తూర్పుగోదావరి, విశాఖ జిల్లా సరిహద్దుల్లో లేటరైట్ తవ్వకాలను (Laterite Digging) పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా బృందాన్ని(tdp team) పోలీసులు అడ్డుకున్నారు. మీడియా సమావేశం నిర్వహించేందుకు నేతలు ప్రయత్నించగా.. రౌతులపూడిలో పోలీసులు అడ్డు చెప్పారు. మన్యంలో లేటరైట్ తవ్వకాల వివరాలను స్థానిక గిరిజనులను అడిగి నేతలు తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో తమ పొలాలు, చెట్లు నష్టపోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం లేటరైట్ తరలింపునకే మన్యంలో రోడ్లు వేశారని తెదేపా బృందం ఆరోపించింది.
ఇదీ చూడండి:FEVER SURVEY: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వేకు సీఎం ఆదేశం