ఏపీ మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలంటూ సోమవారం రాత్రి తెలుగుదేశం నాయకులు పురపాలక కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యాలయంపై దాడి చేశారంటూ 19 మంది నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు…. అందులో భాగంగానే అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిని అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖండించిన చంద్రబాబు
కుప్పంలో అర్థరాత్రివేళ మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు పులివర్తి నానిలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కుప్పంలోని ఓ హోటల్ లో భోజనం చేస్తున్న పార్టీనేతలను అరెస్ట్ చేయడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడు లేనివిధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోందన్నారు. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి కుప్పం నుంచి బలవంతంగా పంపించి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలన్నది జగన్ కుట్ర అని ఆక్షేపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆటలు సాగబోవని స్పష్టం చేశారు. అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను వెంటనే విడుదల చేసి, ప్రజాసామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.