Police arrested Doctor Wife for Supplying Fentanyl Injection : హైదరాబాద్‌లోని అసిఫ్‌నగర్‌కు చెందిన డాక్టర్ హసన్ ముస్తఫాఖాన్ స్థానిక సమీర్ ఆసుపత్రిలో అనస్థీషియన్గా పనిచేస్తున్నాడు. హసన్ తాను పనిచేసే ఆసుపత్రికి అనుబంధంగా పనిచేసే మందుల దుకాణం నుంచి ఫెంటనిల్ ఇంజెక్షన్లను తరచూ తీసుకెళ్తున్నాడు. శస్త్ర చికిత్సల సందర్భంగా పేషెంట్లకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ఫెంటనిల్ ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్ని గసగసల ద్వారా తయారుచేస్తారు. మెదడు మొద్దుబారేలా చేసి విపరీతమైన మత్తుతో నొప్పి తెలియదు.
నిషేధిత డ్రగ్స్ అయిన హెరాయిన్ కంటే 50 రెట్లు, మార్ఫీన్ కంటే 100 రెట్లు ఎక్కువ మత్తు కలుగుతుంది. ఈ ఇంజెక్షన్లు విక్రయించాలంటే ఎన్‌డీపీఎస్ చట్టం కింద లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి ఇంజెక్షన్లను వైద్యుడు ముస్తఫా ఎలాంటి అనుమతి లేకుండా తరచూ తీసుకెళ్తున్నట్లు టీఎస్ న్యాబ్‌కు సమాచారం అందింది. దీంతో టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం దాదాపు నెల రోజులపాటు వైద్యుడి ఇంటిపై నిఘా ఉంచింది.
Police arrested a Man for using Fentanyl Injection : ఈ నిఘా సమయంలో అసిఫ్‌నగర్‌లోని వైద్యుడి నివాసానికి ప్రతీరోజు పోర్టర్ అనే యాప్ ద్వారా సామాగ్రి, వస్తువులు రవాణా చేసే సంస్థ డ్రైవర్లు రావడం, వారు ఒక పార్సిల్ తీసుకుని రాజేంద్రనగర్ పరిధిలోని ఒకరికి ఇస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా భావించిన టీఎస్ న్యాబ్ బృందం రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసుల సహకారంతో ఆపరేషన్ చేపట్టారు. ఇదే సమయంలో వైద్యుడు హసన్ కువైట్ వెళ్లినట్లు గుర్తించి, అతడు తిరిగి వచ్చే వరకూ ఆగాలని భావించారు.