ఉత్తర్‌ప్రదేశ్‌లో రాహుల్ గాంధీపై పోలీసులు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా అందోళనకు దిగిన ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్ ఘటనలో మృతిచెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీలను అడ్డుకుని వారిపట్ల అనుసరించిన వైఖరిని ఖండిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
గాంధీభవన్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో భాజపా కార్యకర్తలు దూసుకు వచ్చి గగన్ విహార్‌కు ఎదురుగా కాంగ్రెస్ నేతలకు పోటీగా రోడ్డు మీద బైఠాయించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. భాజపా శ్రేణులనూ అక్కడి నుంచి తీసుకెళ్లారు. గాంధీభవన్, భాజపా కార్యాలయాల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.