తెలంగాణ

telangana

ETV Bharat / state

పకడ్బందీగా లాక్‌డౌన్‌.. అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు! - lockdown in telangana

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనవసరంగా బయటకు వచ్చినవారి వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కలిపి.. సుమారు 8 వేల కేసులు నమోదు చేశారు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌
పకడ్బందీగా లాక్‌డౌన్‌

By

Published : May 25, 2021, 10:00 PM IST

పకడ్బందీగా లాక్‌డౌన్‌

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. కూడళ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో లాక్‌డౌన్‌ అమలు తీరును డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం పటాన్‌చెరు శివారులోని బాహ్య వలయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు. పాస్‌ ఉన్న అంబులెన్సులను అనుమతిస్తున్నామని తెలిపారు. అయితే పాసులను దుర్వినియోగం చేయకూడదని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

గోషామహల్‌లో ఏసీపీ నరేందర్​రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. కేవలం గంట వ్యవధిలోనే సుమారు 55 వాహనాలను సీజ్‌ చేశారు. హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ పరిధిలో లాక్‌డౌన్‌ను సీపీ అంజనీకుమార్‌ పర్యవేక్షించారు. సుమారు 80కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. జంట నగరాల్లో సోమవారం ఒక్క రోజే 8 వేల కేసులు నమోదు చేశామన్న అంజనీకుమార్‌.. 5,600కుపైగా వాహనాలు జప్తు చేశామని తెలిపారు.

కేసులు నమోదు..

సడలింపు సమయం ముగిసిన తర్వాత కూడా అబిడ్స్, కోఠి, నాంపల్లి, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో రావటంతో పోలీసులు నిలువరించారు. ముమ్మర తనిఖీలు చేపట్టడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. బేగంబజార్‌లో చిన్న చిన్న కారణాలతో బయట తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లంగర్‌హౌస్‌లో ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని ఓ వ్యక్తి ఆరోపించారు. ప్రాథేయపడినా వదల్లేదని తెలిపారు.

దుబ్బపల్లి చెక్‌పోస్ట్ వద్ద సీపీ తనిఖీలు..

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని సీపీ సత్యనారాయణ వెల్లడించారు. సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన సీపీ.. వాహనాలను సీజ్ చేశారు. సంగారెడ్డిలోని వివిధ కూడళ్లలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోతిరెడ్డిపల్లిలో డీఎస్పీ బాలాజీ మైకు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసరం అయితేనే బయటకి రావాలని సూచించారు.

ఈ-పాస్ ఉంటేనే అనుమతి..

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్​రోడ్​ చెక్‌పోస్ట్‌ను వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర తనిఖీ చేశారు. ఈ-పాస్ ఉన్న వాహనాలనే రాష్ట్రంలోకి అనుమతించాలని సూచించారు. ఖమ్మంలో సడలింపు తర్వాత బయటకు వచ్చే వాహనదారులను పోలీసులు నియంత్రిస్తున్నారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో కట్టుదిట్టంగా ఆంక్షలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఇప్పటి వరకు 1,022 వాహనాలు సీజ్‌ చేశారు. వరంగల్‌ పట్టణ జిల్లా హన్మకొండలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతుండగా.. 10 గంటల తర్వాత ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు

ABOUT THE AUTHOR

...view details