తెలంగాణ

telangana

ETV Bharat / state

Secundrabab Incident: సికింద్రాబాద్​ ఘటనలో 52 మంది అరెస్ట్... అతనే కీలక సూత్రధారి - secunderabad railway station

Secundrabab Incident: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆస్తుల విధ్వంసంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాలతో 52 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ విడతలవారీగా గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. హింసాత్మక ఘటనల వెనుక హస్తం ఉందనే అభియోగాలతో సాయి డిఫెన్స్ అకాడమీ సంచాలకుడు సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు.

Secundrabab case
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆస్తుల విధ్వంసం

By

Published : Jun 18, 2022, 8:00 PM IST

Updated : Jun 18, 2022, 10:06 PM IST

Secundrabab Incident: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌ ఆందోళనలతో చెలరేగిన హింసపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు? వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు? వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 52 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసుస్టేషన్ల వారీగా వారీగా వైద్యపరీక్షలకు తరలిస్తున్నారు. గవర్నమెంట్‌ రైల్వే పోలీసుస్టేషన్‌ నుంచి 15మంది, గోపాలపురం పోలీసుస్టేషన్‌ నుంచి 20మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. టాస్క్‌పోర్స్‌ పోలీసులు అదుపులో తీసుకున్న 20మందిని గాంధీ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. వైద్య పరీక్షల తర్వాత నిందితులను ఆర్పీఎఫ్ పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.


ఆర్మీ ఉద్యోగార్థులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులకు ఆధారాలు చిక్కాయి. వాట్సప్ గ్రూపుల్లో యువతను ప్రేరేపించేలా చేసినట్లు తేల్చిన పోలీసులు.. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్స్ పేరిట వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్​కి చెందిన సాయిడిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్​కు చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం పాత్రపైనా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో జరుపుతున్న సంభాషణలు పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 30 మందిలో ఇద్దరు యువకులు బోగీలకు నిప్పుపెట్టినట్లు గుర్తించారు. కామారెడ్డి వాసి సంతోష్, ఆదిలాబాద్ వాసి పృథ్వీరాజ్​పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు.. ఇద్దరూ పెట్రోల్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. కామారెడ్డి వాసి మధుసూదన్.. వాట్సాప్​లో ఆడియో సందేశం పంపినట్లు బోగీలు తగలబెడితే కేంద్రం దృష్టికి వెళ్తుందని ఆడియోలో ఉన్నట్లు తేల్చారు.

సికింద్రాబాద్​ ఘటనలో 52 మంది అరెస్ట్... అతనే కీలక సూత్రధారి

సికింద్రాబాద్ రైల్వేైస్టేషన్‌లో హింస ఘటన వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్​గా వ్యవహరిస్తున్న ఆవుల సుబ్బారావు హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావు.. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో సైనికాధికారిగా పనిచేశారు. 2014 నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట, హైదరాబాద్‌లోనూ సాయి డిఫెన్స్ అకాడమీ బ్రాంచి నిర్వహిస్తున్నారు. అగ్నిపథ్‌కు సంబంధించి ముందుగానే ఆవుల సుబ్బారావుకు కొంత సమాచారం లీక్ అయినట్లు తెలిసింది. గుంటూరు ఆర్మీ కార్యాలయం వద్ద.. నెలరోజుల నుంచి ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారితో మాట్లాడి ఈ ఆందోళనలకు నాయకత్వం వహించినట్లు సమాచారం. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో 80 నుంచి 90 శాతం మంది సాయి డిఫెన్స్ అకాడమీ వారే ఉన్నట్లు సమాచారం. అగ్నిపథ్ పథకం వల్ల ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. దీన్ని అంగీకరిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందంటూ యువకులను రెచ్చగొట్టి వారితో ఆందోళనలు చేయించినట్లు తెలుస్తోంది.

సుబ్బారావు సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఇతర ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నుంచి యువకులను రప్పించి ఆందోళన చేయించినట్లు సమాచారం. రైల్వే స్టేషన్​లో ఆందోళన సమయంలో యువకులకు తాగునీరు, ఆహారం ఇతర పదార్థాలు.. ఈ డిఫెన్స్ అకాడమీ ద్వారా సమకూరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి:

Damera Rakesh's funeral: అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్​ అంత్యక్రియలు

ఆగని 'అగ్గి'.. వాహనాలు 'బుగ్గి'.. దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా 'అగ్నిపథ్​' నిరసనలు

Last Updated : Jun 18, 2022, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details