Loan Apps: హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి ఉన్నఫలంగా డబ్బులు అవసరం పడటంతో రుణ యాప్‌లను ఆశ్రయించింది. తన ఫోన్‌లో 4 అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకొని ఒక్కో యాప్ నుంచి రూ.10 వేల చొప్పున రూ.40 వేలు రుణంగా తీసుకుంది. 30 రోజుల వ్యవధిలో చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. విడతల వారీగా డబ్బులు చెల్లిస్తూ వచ్చినా.. రుణ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మాత్రం ఆగలేదు. ఇలా నెల వ్యవధిలో రూ.2 లక్షలకు పైగా చెల్లించినా.. ఇంకా కొంత చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా బాధితురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలను ఆమె కాంటాక్ట్ లిస్టులో ఉన్న పలువురికి పంపించారు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 4 రుణ యాప్‌లు నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వసూలు చేసినట్లు తేల్చారు. మనీ లెండర్స్ చట్టం కింద 4 రుణ యాప్‌లపై కేసు నమోదు చేశారు.
ఐటీ యాక్ట్‌తో పాటు వేధింపులకు పాల్పడినందుకు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నిందితులకు కనీసం ఆర్నెళ్ల జైలు శిక్ష ఉంటుంది. గతంలో పాతబస్తీలోని కొంత మంది పహిల్వాన్లపై మనీ లెండర్స్ చట్టం ప్రయోగించారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వాళ్లపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పలు రుణ యాప్ సంస్థలపై కేసులు నమోదయ్యాయి. అయినా నిర్వాహకులు మాత్రం వెనకడుగు వేయడం లేదు.
బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తూ.. సులభ రుణాలు ఇస్తామంటూ పలువురిని ఆకర్షిస్తున్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వెంటనే రుణాలు మంజూరు చేస్తున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే రుణగ్రహీత ఫోన్‌లో ఉన్న కాంటాక్టు నెంబర్లను తీసేసుకుంటున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించినా.. మరికొంత మొత్తం చెల్లించాలని వేధిస్తున్నారు. చెల్లించకపోతే కాంటాక్టు లిస్ట్‌లో ఉన్న వాళ్లకు రుణగ్రహీత గురించి దుష్ప్రచారం చేయడం, అసభ్య వీడియోలు పంపిస్తున్నారు. వేధింపులు తాళలేక రాష్ట్రవ్యాప్తంగా పది మందికి పైగా మృతి చెందారు. వందలాది మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో రుణ యాప్‌లపై నమోదైన కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. నష్టాల్లో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను ఎంచుకొని చైనీయులు వాటిలో పెట్టుబడులు పెట్టి రుణ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దివాలా తీసిన ఎన్బీఎఫ్సీలతో కొన్ని ఫిన్‌టెక్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అవి లోన్ యాప్స్ రూపొందించి.. వాటి ద్వారా స్వల్ప కాలిక రుణాలు ఇస్తున్నారు. ఈడీ అధికారులు సుమారు 20 ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.265 కోట్లను జప్తు చేశారు. ఇండిట్రేడ్ ఫిన్‌కార్ప్, అగ్లో ఫిన్ ట్రేడ్‌తో పాటు మరో 10 సంస్థలకు చెందిన 233 బ్యాంకు ఖాతాలను గుర్తించిన ఈడీ అధికారులు.. ఆయా ఖాతాల్లోని నగదును జప్తు చేశారు. పలు రుణ యాప్‌లు రూ.4,430 కోట్లకు పైగా రుణాలు ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. రూ.800 కోట్లకు పైగా లాభం ఆర్జించినట్లు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో ముగ్గురు చైనీయులతో పాటు.. బెంగళూరు, ముంబయి, దిల్లీకి చెందిన 25 మందిని అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ 10 మందిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రుణ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనుమతిలేని రుణ యాప్‌లను ప్లే స్టోర్‌లో నుంచి తొలగించాల్సిందిగా గూగుల్ ప్రతినిధులకు సైబర్ క్రైం పోలీసులు లేఖ రాశారు. కానీ ఆశించిన స్పందన రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.