ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరిలో ఇంకా వరద రాలేదు. ప్రవాహాలు లక్షల క్యూసెక్కులకు చేరలేదు. కానీ పోలవరం వద్ద జలాశయంలో పెద్ద ఎత్తున నీరు నిలిచి వెనక్కుమళ్లుతోంది. పోలవరం క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నా.. నీరు వెనక్కు ఎగదన్నుతోంది. పోలవరం నుంచి ఎగువకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో వేలేరుపాడు సమీపంలో గోదావరి వద్ద పెద్ద ఎత్తున నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం నుంచి గోదావరిలో పెద్దగా ప్రవాహాలు దిగువకు రాని పరిస్థితుల్లోనూ ఇంత నీరు నిలవడం ఇదే తొలిసారి అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
వరద లేనప్పుడే కాఫర్ డ్యాం ప్రభావం ఈ స్థాయిలో ఉంటే వరద రోజుల్లో ఇంకే స్థాయిలో ఉంటాయో అన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల్లో 45 గ్రామాలను నీరు చుట్టుముట్టింది. దీంతో దేవీపట్నం మండలంలోని దాదాపు 15 కు పైగా గ్రామాల ప్రజలు తమ పునరావాసాన్ని తామే ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.
ఇప్పటికే దేవీపట్నం మండలాన్ని గోదావరి వరద నీరు చుట్టుముట్టింది. మంటూరు, మడిపల్లి, మూలపాడు, అగ్రహారం, పెనికిలపాడు, ఏనుగులగూడెం, దేవీపట్నం, తొయ్యేరు, ఎ.వీరవరం, చిన రమణయ్యపేట పూడిపల్లి, పోశమ్మగండి తదితర గ్రామాల ప్రజలు ఊళ్లను ఖాళీ చేశారు. గోకవరం, కృష్ణునిపాలెం, రమణయ్యపేట గ్రామాల్లో అద్దె ఇళ్లు తీసుకుని ఉంటున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలకు అద్దె ఇళ్లు కూడా దొరకడం లేదు. వరద ఉన్న మూడు, నాలుగు నెలలే ఉంటారు. ఆ తర్వాత వెళ్లిపోతారని ఎవరూ అద్దెకు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
ప్రభుత్వం సాయం అందట్లేదు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు (Polavaram project expatriates problems ) తల్లడిల్లిపోతున్నారు. గోదావరి నీరు ఊళ్లను ముంచేస్తుండటంతో బతుకు జీవుడా అంటూ ఇళ్లను ఖాళీ చేసి తలోదిక్కుకు చేరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములను, ఊళ్లను, జీవితాలను త్యాగం చేసినా తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేకపోయారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పిన పునరావాస ప్యాకేజీ నిధులూ అందలేదు. కాలనీల నిర్మాణమూ పూర్తి చేయలేదు.
ఆగస్టు నాటికి నిర్వాసితులందరినీ కాలనీలకు తరలిస్తామంటూ అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికలు వాస్తవ రూపం దాల్చేలా కనిపించడం లేదు. మరోవైపు పోలవరం ఎగువన నిర్మించిన కాఫర్‌డ్యాం వల్ల ఇప్పటికే నీరు నిలిచిపోయింది. పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతుండటంతో బాధితులు ఎవరికి వాళ్లే చేతికి అందినవి సర్దుకుని వెళ్లిపోతున్నారు. మరికొందరు బంధువులను ఆశ్రయిస్తున్నారు. గిరిజనులు ఎత్తయిన కొండల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుతో ముంపు ఏర్పడే ఉభయగోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లోని వివిధ గ్రామాలను ‘ఈనాడు-ఈటీవీ భారత్’ బృందం సందర్శించింది. పునరావాస కాలనీల నిర్మాణ తీరుతెన్నులను చూసింది. నిర్వాసితులతో మాట్లాడింది. వారి గుండెల్లోంచి గోదారి పొంగుకొచ్చింది. కిందటి ఏడాది ముంపులో చిక్కుకుని పడ్డ కష్టాలు గుర్తొచ్చి వారి ఆవేదన ఆక్రందనైంది. కాఫర్‌డ్యాంతో ఈ ఏడాది మరింత వరద చుట్టుముడుతుందని చెబుతున్నారని, ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు భరించాలో అంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. తమకు దిక్కు చూపే వారే లేరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ మైలురాయిలా కనిపిస్తున్నదే ఎఫ్‌ఆర్‌ఎల్‌ను సూచించే రాయి. అంటే పోలవరం జలాశయంలో పూర్తి స్థాయి నిల్వ ఉంటే +45.72 మీటర్ల స్థాయి వద్ద ఎంతవరకు నీరు నిలుస్తుందో అది సూచించేరాయి. వేలేరుపాడు మండలం కొయిద గ్రామ గిరిజనులు ముందుచూపుతో ఈ రాయికి ఎగువనే గుడిసెలు నిర్మించుకుంటున్నారు. ఎంత వరద వచ్చినా ఆ రాయి దాటి రాదని వారు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్నది కెచ్చెల చిన్నారెడ్డి, అతని కొడుకు...తండ్రి కెచ్చెల లచ్చిరెడ్డి, తల్లి, మరో అన్నయ్య కెచ్చెల శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఇక్కడ గుడిసె నిర్మించుకున్నారు.