తెలంగాణ

telangana

ETV Bharat / state

Polavaram Project: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు! - polavaram project expatriates

ఏపీ ప్రభుత్వం పోలవరం ముంపు పరిధిలో 20వేల కుటుంబాలను ఆగస్టు నాటికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పూర్తికాని ఇళ్లతో నిర్వాసితులకు కడగండ్లు తప్పట్లేదు. పోలవరం పునరావాస అధికారుల ప్రణాళిక ప్రకారం మొత్తం 16,294 కుటుంబాలను తరలించాల్సి ఉంది. జులై నెలాఖరుకు 7,225 కుటుంబాలను, ఆగస్టులో 9,069 కుటుంబాలను తరలిస్తామని కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు, రాష్ట్ర ముఖ్యులకు కూడా పునరావాస అధికారులు నివేదికలు సమర్పిస్తున్నారు. నిజానికి ఇంతకుముందు ఈ తరలింపు ప్రణాళికల గడువు వేరే ఉండేది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్షల సమయంలో జూన్‌ నెల ప్రారంభానికే నిర్వాసితుల తరలింపు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మొండి స్తంభాల స్థాయిలోనే కాలనీలు ఉంటే అసలు తరలింపు ప్రణాళిక సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

polavaram-project
పోలవరం ప్రాజెక్టు

By

Published : Jul 15, 2021, 9:32 AM IST

పోలవరం పునరావాసం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అక్షరాలా అద్దం పట్దే దృశ్యం ఇది. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్న ఈ కాలనీలో ఎటు చూసినా మొండి స్తంభాలే కనిపిస్తున్నాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి కాలనీ దుస్థితి ఇది. పోలవరం పునరావాస కాలనీల్లో ఇదో పెద్ద కాలనీ కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 4,027 ఇళ్లు నిర్మించాలనేది ప్రణాళిక. ఇదొక్కటే కాదు. చాలా వరకు పోలవరం పునరావాస కాలనీల్లో ఇళ్లు పూర్తి కాలేదు. ఆగస్టు నాటికి 20 వేల కుటుంబాలను తరలించాలనే లక్ష్యానికి ఇంకా అమడ దూరంలోనే క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయి.

పోలవరం పునరావాస అధికారుల ప్రణాళిక ప్రకారం మొత్తం 16,294 కుటుంబాలను తరలించాల్సి ఉంది. జులై నెలాఖరుకు 7,225 కుటుంబాలను, ఆగస్టులో 9,069 కుటుంబాలను తరలిస్తామని కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు, రాష్ట్ర ముఖ్యులకు కూడా పునరావాస అధికారులు నివేదికలు సమర్పిస్తున్నారు. నిజానికి ఇంతకుముందు ఈ తరలింపు ప్రణాళికల గడువు వేరే ఉండేది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్షల సమయంలో జూన్‌ నెల ప్రారంభానికే నిర్వాసితుల తరలింపు పూర్తి అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మొండి స్తంభాల స్థాయిలోనే కాలనీలు ఉంటే అసలు తరలింపు ప్రణాళిక సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

స్నానాల గదులకు చీరలే అడ్డు!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పెదభీంపల్లి పునరావాస కాలనీలో వరుసగా స్నానాల గదులు నిర్మించారు. ఇప్పటికీ వీటికి తలుపులు ఏర్పాటు చేయలేదు. ఆ గదులకు చీరలో, తెరలో అడ్డుగా పెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ కాలనీలకు వచ్చిన మహిళలు ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. అంతో ఇంతో పూర్తయిన కాలనీలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తవలేదు. ఇతరత్రా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. కిందటి ఏడాది రూ.5,000 అద్దెకు రంపచోడవరంలో నివాసం ఉన్నామని, ఇప్పుడు ఆ అద్దెను భరించలేకనే కాలనీకి వచ్చేసినట్లు నడిపూడి శివజ్యోతి చెప్పారు. ఆమె ఈ కాలనీలోకి కుటుంబంతో సహా వచ్చారు. ఇంకా పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదని అంటున్నారు.

ఇళ్లల్లోకి వచ్చిన తర్వాత సున్నం

దేవీపట్నం మండలం పునరావాస కాలనీలోని ఇళ్లలోకి కొందరు నిర్వాసితులు వచ్చేశారు. ఇంకా పనులు పూర్తి చేయకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిల్లో చేరారు. ఇప్పుడు ఆ ఇళ్లకు గుత్తేదారు సున్నం వేయిస్తుండటంతో అందరూ మళ్లీ సామాన్లను బయటకు తీసుకువచ్చారు. అసలే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఇదో ఇబ్బంది అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా ఊరు ముంపులో ఉందా?

దేవీపట్నం మండలం కె.వీరవరం గ్రామస్థులు వీరు. గోదావరి వరదతో దండంగి వాగు ఉప్పొంగి ఊరిని ముంచెత్తుతోంది. ఎప్పుడో మాకు పట్టాలు ఇచ్చారు. ఇప్పటికీ ఆ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించలేదు. పునరావాస ప్యాకేజీ ఊసే లేదు. ఏ అధికారి వచ్చి ఏమీ చెప్పడం లేదు. ఈ గ్రామం ముంపులో లేదని కొందరంటున్నారు. కిందటేడాది వరదతో ఇబ్బందులు పడ్డాం. ఊళ్లోకి నీరు వస్తోంది. అద్దెలకు వెళ్దామంటే కూలీ చేసుకుని బతికేవాళ్లం. ఏం చేయగలం’’ అని ప్రశ్నిస్తున్నారు.

ఎ.వీరవరం గ్రామస్థులది మరో బాధ. 2009లో ఆ ఊరి వారికి పునరావాస ప్యాకేజీ కింద రూ.1.55 లక్షలు ఇస్తామన్నారు. అందుకు ఆ ఊరి వారు అంగీకరించారు. అప్పట్లో కుటుంబానికి రూ.90 వేల చొప్పున ఇచ్చారు. మిగిలిన సొమ్ములు ఇవ్వకపోడంతో ఊరు ఖాళీ చేయలేదు. ఇప్పుడు 2013 చట్టం కింద తమకు పరిహారం ఇవ్వాలని ఆ ఊరి వారు కోరుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ +45.72 మీటర్ల స్థాయికి సాంఘిక ఆర్థిక సర్వే పూర్తి కాలేదు. ఏ ఊరులో ఎవరు నిర్వాసితులో తేల్చలేదు. దీంతో దేవీపట్నం, కూనవరం, వర రామచంద్రపురం, చింతూరు మండలాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేసేస్తున్నారు. ఊళ్లల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. అసలు తమ పరిస్థితి ఏమిటో తేల్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీరుకారుతున్న కొత్త ఇళ్లు!

ప్పటికే వివిధ కాలనీల్లోకి 3,000 కుటుంబాలను తరలించామని అధికారులు చెబుతున్నారు. పూర్తయిన ఇళ్లు మరీ దారుణంగా ఉంటున్నాయని నిర్వాసితులు గోలపెడుతున్నారు. దేవీపట్నం మండలం ముసినిగుంట కాలనీలో ఇళ్లు కారిపోతున్నాయని గంగపాలెంకు చెందిన మడకం వెంకన్నదొర ఆవేదన వ్యక్తంచేశారు.

వరద ముంపుతో నిర్వాసిత గ్రామాల్లో కరెంటు కూడా ఇవ్వడం లేదు. ఇంతకుముందు రాత్రి వేళల్లో విద్యుత్తు ఇచ్చేవారు. ఇప్పుడు అందరం చీకట్లో ఉండవలసి వస్తోంది. మరోవైపు నిర్మించే కాలనీలు నాణ్యంగా లేవు. అధికారులను తీసుకువచ్చి చూపిస్తున్నా ఏదో పైపై మరమ్మతులు చేయిస్తున్నారు. పిల్లలతో ఉండాల్సిన వాళ్లం. ఎలా ఉండగలం

-మడకం వెంకన్నదొర

ఈ ఇల్లు మాది కాదు... ఉండేందుకు భరోసా లేదు!!

ది మరో విచిత్రం. ఈమె పేరు పునాపు సత్తెమ్మ. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం ఈమెది. కుక్కునూరు దాచారం కాలనీలోకి ఆమె భర్తతో సహా తరలివచ్చారు. వారుంటున్న ఇంటి స్నానపుగదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. నిజానికి వీరు తాడ్వాయి పునరావాస కాలనీలోని ఇంటికి వెళ్లాలి. అక్కడ నిర్మాణం పూర్తి కాకపోవడంతో, గోదావరి ముంపు భయంతో, వేరే ప్రత్యామ్నాయం లేక, అద్దెకు ఇల్లు తీసుకునే స్తోమత లేక ఇక్కడికి వచ్చేశారు. ఇంటి నిర్మాణం పూర్తి కాకున్నా. కనీసం తలుపులు కూడా లేకున్నా ఏదో సర్దుకుని ఉందామని వచ్చేశారు. ఇంతకీ అధికారులు ఏమంటున్నారంటే... ఈ ఇల్లు అసలు యజమాని వస్తే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇక్కడ ఒక్క చోటే కాదు... ఇతర అనేక కాలనీల్లోనూ ఇదే పరిస్థితి. ఇంతవరకు చాలాచోట్ల నిర్వాసితులకు వారి వారి ఇళ్లను కేటాయించి చూపలేదు. ఏ దారి లేక ఈ ఏడాదికి ఎక్కడో అక్కడ ఉందామని కొందరు నిర్వాసితులు ఆయా ఇళ్లకు వచ్చి ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం కాలనీల్లోనూ ఇదే మాట వినిపించింది. కొండమొదలు నుంచి వచ్చామని, తమకు ఇంకా పునరావాసం తేల్చలేదని చెబుతున్నారు. వేరే వారు వస్తే వెళ్లిపోవాలని అధికారులు అంటున్నారని వాపోతున్నారు.

సకాలంలో అందని బిల్లులు... కరోనా కష్టాలు

తొలి దశ పునరావాసంలో భాగంగా 73 పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టారు. అందులో ఇంకా 47 కాలనీల పనులు సాగుతూనే ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు ఇళ్లు, మౌలిక వసతుల నిర్మాణ బాధ్యతలు అప్పగించి పనులు చేపట్టినా సకాలంలో పూర్తి కాలేదు. కరోనాతో నిర్మాణ కార్మికులు రాకపోవడం, తదితర కారణాలతో పనులు ఆలస్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. పైగా తమకు సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదని, అందువల్ల పనుల పూర్తిలో జాప్యం అవుతోందని కొందరు గుత్తేదారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:Polavaram Project Expatriates: నది సంద్రంలో నిర్వాసితుల విలవిల

ABOUT THE AUTHOR

...view details