తెలంగాణ

telangana

ETV Bharat / state

Godavari Flood: పోలవరం నిర్వాసితుల వెతలు... జలదిగ్భందంలోనే గ్రామాలు

గోదావరికి వరద పోటెత్తుతోంది. ఏపీలోని పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణంతో ముంపు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో తీర ప్రాంత గ్రామాల్లోకి నీరు చేరడంతో బాధితులు ఇళ్లు ఖాళీ చేసి కొండలపై పాకలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోశమ్మగండి వద్ద అమ్మవారి ఆలయంతోపాటు ఇళ్లు మునిగిపోయాయి..

By

Published : Jul 15, 2021, 12:34 PM IST

Godavari Flood
పోలవరం నిర్వాసితుల వెతలు

ఆంధ్రప్రదేశ్​లో వర్షాల కారణంగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద భయంతో ఇళ్లను ఖాళీ చేసిన నిర్వాసితులు మైదాన ప్రాంతాలకు తరలివెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తిగా మూసివేయడంతో గోదావరి జలాలు వెనక్కి పోటెత్తుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతోపాటు... స్థానికంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పెద్దఎత్తున వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. పోలవరం స్పిల్‌వే నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నా.. కాఫర్ డ్యాం నుంచి వెనక్కి మళ్లిన నీరు ఊర్లను ముంచెత్తుతోంది. దేవీపట్నం మండలం జలదిగ్భందంలో చిక్కుకుంది.

కొండే వారి ఆవాసమౌతోంది..!

కొండమొదలు పంచాయతీ పరిధిలోని 11 గిరిజన గ్రామాల్లోకి నీరు చేరింది. దీంతో అడవి బిడ్డలు ఊళ్లను వదిలేసి కొండలు, గుట్టలపై తల దాచుకుంటున్నారు. వీరు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొన్న పూరి పాకల్ల్లో విద్యుత్, తాగు నీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. అలాగే మంటూరు నుంచి దేవీపట్నం మీదుగా వీరవరం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా గ్రామాల్లోకి గోదావరి నీరు చేరింది. రహదారులు నీటమునిగిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం స్పందించి పరిహారం, పునరావం కల్పించాలని నిర్వాసితులు వేడుకొంటున్నారు. పూడిపల్లిలో ఎస్సీ కాలనీ, అంగన్వాడీ కేంద్రం, పాఠశాలల్లోకి వరద నీరు చేరింది. దేవిపట్నం - తొయ్యేరు ఆర్అండ్ బీ రహదారిపై పూర్తిగా వరదనీరు చేరడంతో మంటూరు నుంచి రంపచోడవరంపై రాకపోకలు నిలిచిపోయాయి.

నీటమునిగిన పూడిపల్లి

గ్రామంలోని జనం మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు. పోచమ్మ గండి ఆలయం నీట మునిగింది. సీతానగరం వైపు నుంచి పి.గొందూరు వరకు మాత్రమే రాకపోకలు అతికష్టం మీద సాగుతున్నాయి. పాపి కొండల విహార యాత్ర నిలిచిపోయింది. సీతపల్లి వాగుకు గోదావరి నీరు పోటెత్తడంతో ... దండంగి గ్రామంలోకి నీరు చేరుతోంది. గోకవరం, రంపచోడవరం వైపు నుంచి కూడా కొన్ని గ్రామాల వరుకు మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. విలీల మండలాలైన వీఆర్​పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లోని ప్రజలు సైతం బిక్కుబిక్కున కాలం వెళ్లదీస్తున్నారు. పునరావాసం, పరిహారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్నో చలనచిత్రాకు వేదికగా నిలిచిన పూడిపల్లి పూర్తిగా నీటమునిగింది.

పోలవరం నిర్వాసితుల వెతలు

ఊళ్లన్నీ జలదిగ్బంధంలో

గోదావరిలో ప్రారంభ ప్రవాహాలకే ఊళ్లన్నీ జలదిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. గోదావరి, శబరికి వరదలు తోడైతే పరిస్థితి ఊహించుకోవడానికి కష్టమని బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి:Polavaram Project: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!

ABOUT THE AUTHOR

...view details