తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా పరీక్ష తర్వాతే ప్రవేశం... మీడియా పాయింటు ఉండదు'

సమావేశాల అనంతరం మీడియా పాయింట్​ ఉండదు: పోచారం
సమావేశాల అనంతరం మీడియా పాయింట్​ ఉండదు: పోచారం

By

Published : Sep 4, 2020, 5:12 PM IST

Updated : Sep 5, 2020, 6:30 AM IST

17:06 September 04

సమావేశాల అనంతరం మీడియా పాయింట్​ ఉండదు: పోచారం

సమావేశాల అనంతరం మీడియా పాయింట్​ ఉండదు: పోచారం

వర్షాకాల  సమావేశాల అనంతరం మీడియా పాయింట్​ ఉండదని స్పీకర్​ పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు సభలోనే సమయం ఇస్తామని.. దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లో వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. సమావేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎస్, సీనియర్ అధికారులు, పోలీసు అధికారులతో చర్చించామన్నారు. గత సమావేశాలు వేరు, కొవిడ్ సమయంలో జరుగుతున్న ఈ సమావేశాలు వేరని వివరించారు.  

ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న సమావేశాలకు పార్లమెంట్ మార్గదర్శకాలకు లోబడి అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పోచారం తెలిపారు. శాసససభ, మండలిలో భౌతికదూరం ఉండేలా సీటింగ్​లో  మార్పులు చేశామని... ఆవరణలో థర్మల్ స్కానర్ కెమెరాలు, శానిటైజర్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంబులెన్స్​లు, అవసరమైన పరికరాలు, వైద్యసిబ్బందిని కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రాంగణంలో తరచూ శానిటైజ్ చేస్తామని తెలిపారు. సభ్యులకు అక్సీమీటర్, శానిటైజర్ తో కూడిన కిట్లను అందించనున్నట్లు పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని స్పష్టం చేశారు.  

కరోనా నుంచి ఇంకా బయటపడలేదని.. ప్రభుత్వం, సీఎం తగు చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గిందని పోచారం తెలిపారు. కొవిడ్ బారినపడే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తగ్గిందన్నారు. సమావేశాలకు వచ్చే వారందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశాలకు వచ్చే వారంతా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  

సభ్యులు, అధికారులు, సిబ్బంది, పోలీసులు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్ పాజిటివ్ తేలితే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ పరీక్షలు చేసుకోవాలి. నియోజకవర్గాల్లో ఉంటే అక్కడి వైద్యులు పరీక్షలు చేస్తారు. ఎమ్మెల్యేల పీఏలకు అనుమతి ఉండదు. సమావేశాలు ఎన్ని రోజులు జరిగినా.. బంధువులు, ఇతర ప్రాంతాలకు వెళ్లకండి. కరోనా కనపడనటువంటి వ్యాధి కాబట్టి.. ఎవరికి వచ్చినా మన కుటుంబాలు బాధపడతాయి. అందుకే ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. నాకు కరోనా నెగెటివ్​ వచ్చింది. ఇప్పటికి నాలుగు సార్లు చరవాణికి నెగెటివ్​ వచ్చినట్లు సందేశం వచ్చింది. మళ్లీ పరీక్ష చేయించుకుంటే మళ్లీ నెగెటివ్​ వస్తుంది.  

-పోచారం శ్రీనివాస రెడ్డి, సభాపతి

కొవిడ్ వల్ల కొందరు పాత్రికేయులు కూడా భౌతికంగా దూరం కావడం బాధాకరమని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి తెలిపారు. సమావేశాల సమయంలో ఎవరూ ఇబ్బందిపడకుండా చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మీడియాకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.  

ఎన్ని రోజులైనా సిద్ధం:

సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు, ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమావేశాల ద్వారా చెప్పాలని సీఎం భావిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని వెల్లడించారు. ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల స్ఫూర్తిగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.  

మంత్రులు ఇద్దరు, ముగ్గురి కంటే ఎక్కువ సహాయకులను తీసుకురావద్దని ప్రశాంత్​ రెడ్డి కోరారు. సంబంధిత అంశాలపై చర్చ ఉన్నప్పుడు ఒకరిద్దరు అధికారులు రావాలని సూచించారు. మీడియా పాసులు తీసుకునే వారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఒక్కో సంస్థ తరఫున రెండు పాసులు ఇస్తామన్నారు. సమావేశాల ప్రత్యక్షప్రసారాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.  

ఇవీచూడండి:ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్​

Last Updated : Sep 5, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details