Pm Muchhinthal Tour: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఆశ్రమం శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే వేడుకలలో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
పీఎం పర్యటన ఖరారు...
ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జీయర్‌స్వామి ఆశ్రమానికి సమాచారం అందింది. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మోదీ ఆశ్రమానికి చేరుకుంటారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇస్తారు. హోమంలో పాల్గొంటారు. దాదాపు 4 నుంచి 5 గంటలపాటు మోదీ పర్యటన కొనసాగనుంది. కార్యక్రమంలో ఆయనతోపాటు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఉత్సవాలు నిర్వహించే రోజులలో భారీఎత్తున హోమాలు జరగనున్నాయి. సమతామూర్తి విగ్రహానికి సమీపంలోనే దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి.
విదిక్కులలో సమూహంగా నిర్మాణం...
పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు ముడుంబై మధుసూదనాచార్యస్వామి పర్యవేక్షణలో 144 యాగశాలలతోపాటు ప్రధాన యాగశాల నిర్మించారు. నాలుగు విదిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టిశాలలు. వీటన్నింటిలో 1,035 హోమకుండాలు నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించనున్నారు.