PM Modi Visits Hyderabad Today :రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ.. ఆ దిశగా నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీసీ ఆత్మగౌరవ సభ పేరిట ఎల్బీస్టేడియం వేదికగా..ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ... ఆ సభను నిర్వహిస్తోంది. బీసీ ముఖ్యమంత్రి హామీని క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆ సభకు ఆహ్వానించారు. రాష్ట్ర నాయకత్వం ఆహ్వానం మేరకు బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కాషాయరంగు పులుముకున్నాయి. ఆ సభకు.. సుమారు లక్ష మందిని తరలించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
Modi Attends BC Meeting in Hyderabad Today :సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీస్టేడియానికి బయలుదేరి వెళ్తారు. ఐదున్నర నుంచి 6 గంట 10 నిమిషాల వరకు బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సభా వేదికగా పలు కీలక హామీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. సభ అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి 6 గంటల 35 నిమిషాలకు దిల్లీకి తిరిగివెళ్తారని బీజేపీ నేతలు వెల్లడించారు.
42 మందితో బీజేపీ ప్రచారకర్తల జాబితా విడుదల, చర్చల అనంతరం విజయశాంతి, రఘునందన్ రావు పేర్లు
ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లను.. ఆ పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, తరుణ్‌చుగ్ పరిశీలించారు. సభావేదిక, ప్రవేశ ద్వారాలు, గ్యాలరీలను.. నేతలు పరిశీలించారు. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేసి తీరుతామన్న లక్ష్మణ్.. ప్రధాని హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. బీసీలంతా ఒక్కటవుతున్నారని బీఆర్ఎస్ కుర్చీలు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.