'ఎలాంటి వైరస్నైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి' కరోనా వ్యాప్తి, చేపట్టాల్సిన చర్యలు, ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై ప్రధాని మోదీ...10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షించారు. దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానికి వివరించారు. కరోనా రికవరీ రేటు 71 శాతంగా ఉందని తెలిపిన కేసీఆర్....మరణాల రేటు 0.7 శాతంగా ఉందని తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచామని... బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. పడకలు, మందులు, ఇతర పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచామని ప్రధానికి వివరించారు. ఐసీఎంఆర్, నీతిఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని వెల్లడించారు.
ఇలా చేద్దాం...
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీకి పలు సూచనలు చేశారు. భవిష్యత్‌లో వైద్య రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలను ప్రస్తావించారు. కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. విజనరీతో...సదుపాయాలు పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందని పేర్కొన్నారు. వైరస్ అనుభవాలు పాఠం నేర్పాయన్న ముఖ్యమంత్రి... సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసే ఈ ప్రణాళిక అమలు చేయాలని పేర్కొన్నారు. గతంలో కరోనా లాంటి అనుభవం లేదని.. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు. అనేక వైరస్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయని.. భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం లేకపోలేదని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులు, వైద్య కళాశాలల ఏర్పాటుపై ఆలోచించాలని ప్రధానికి సూచించారు. ఐఎంఏ వంటి సంస్థలను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయమని.. దేశానికి మంచి చేసే చర్యని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వైరస్‌లు వచ్చినా తట్టుకునేలా వైద్యరంగం తయారుకావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకు ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని కోరారు. ప్రధానితో జరిగిన సమావేశంలో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'