PM Modi Tour: రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలకాలని కమలదళం నిర్ణయించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా జాతీయ నేత లక్ష్మణ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. బేగంపేట విమానాశ్రయం ప్రాంగణంలోనే ప్రధాని సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదిక నుంచి కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు .
సభకు భారీ జనసమీకరణలో నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని పర్యటన, బేగంపేటలో స్వాగత సభ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సభ అనంతరం హెలికాప్టర్‌లో రామగుండం చేరుకుంటారు. అక్కడ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు మోదీకి స్వాగతం పలకనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు
సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల కార్మాగారం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని పర్యటనపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, రామగుండంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం: పెద్దపల్లి కలెక్టర్, రామగుండం సీపీ, రామగుండం ఫర్టిలైజర్స్ సీఈఓతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రామగుండంలో ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. భాజపాయేతర రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేపడతామన్నారు.