Vande Bharat Express launch today : తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు నేటి నుంచి పరుగులు పెట్టనుంది. ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా....జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. సికింద్రాబాద్‌లోని 10వ నంబర్ ప్లాట్ ఫాం నుంచి వందేభారత్ రైలు ప్రారంభంకానుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పర్యటించారు. అధికారులతో కలిసి రైల్వే స్టేషన్‌ను పరిశీలించి ఏర్పాట్లు సమీక్షించారు. ఆనంతరం కేంద్ర మంత్రులు వందేభారత్ రైలులోకి వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆధునిక సాంకేతికతతో వందేభారత్ రైలు రూపకల్పన జరిగిందని... కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఉభయ రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలును కేంద్రం ప్రారంభిస్తోందని తెలిపారు.
Vande Bharat Express in Secunderabad : వందేభారత్ రైలులో 16 బోగీలు ఉంటాయన్న అధికారులు అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జీక్యూటీవ్ చైర్‌కార్ బోగీలుంటాయన్నారు. మొత్తంగా రైలులో 1128 మంది ప్రయాణించవచ్చని తెలిపారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగులు పెడుతుందని వివరించారు. మెట్రో రైల్ తరహాలో స్లైండింగ్ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, అత్యవసర పరిస్థితుల్లో రైల్ సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా అలారం బటన్ ఏర్పాటు చేశారు.