PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాద్ రాబోతున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభించడంతో పాటు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. దీనిపై రైల్వే శాఖకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.
Secunderabad to Tirupathi Vande Bharat Express :తాజాగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ కొత్త సర్వీసు ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం కానుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ వందేభారత్ నూతన సర్వీసు నడవనుంది. దీనికి సంబంధించి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ట్రయిల్ రన్ ఇప్పటికే పూర్తి చేశారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న మూడు మార్గాల్లో ఏ రూట్‌ను ఖరారు చేయాలనే దానిపైనా అధ్యయనం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ఇతర రైళ్లల్లో ప్రయాణికులకు దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అదే వందేభారత్ అందుబాటులోకి రావటం ద్వారా 6 నుంచి 7 గంటల సమయంలోనే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం లభిస్తుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మూడు మార్గాలను అధికారులు పరిశీలించారు. అందులో బీబీనగర్, ఖాజీపేట, విజయవాడ మీదుగా ట్రైన్‌ను నడపడంపై అధ్యయనం చేశారు. అయితే, ప్రస్తుతం నారాయణాద్రి నడుస్తున్న మార్గంలోనే ఈ వందేభారత్ నడపాలని రైల్వే అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో సికింద్రాబాద్-బీబీనగర్, నల్గొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడూరు, కాళహస్తి మీదుగా తిరుపతికి నడపాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే సమయంలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మీదుగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు, కాళహస్తి మీదుగా అధికారులు సర్వే చేశారు. నారాయణాద్రి రూట్లో ఈ ట్రైన్‌ను పిడుగురాళ్ల వరకు నడిపి.. అక్కడి నుంచి శావల్యాపురం వైపు మళ్లించే ఆలోచనలోనూ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్న వేళ.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ఇప్పటికే జనవరి 15న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించిన సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ రైలు విజయవంతంగా నడుస్తోంది. ఈ ట్రైన్ రాకతో ఇరు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 4 గంటలు తగ్గింది.
ఇవీ చదవండి: