PM Modi on ICRISAT: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. ఇక్రిశాట్ పరిశోధనలు పురోగతిపై ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. ఇక్రిశాట్లో క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీని, రాపిడ్ జెన్ రీసెర్చ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఆయన చేతులమీదుగా ప్రారంభించారు.
శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని
వసంత పంచమి రోజునే ఇక్రిశాట్ స్వర్ణోత్సవం జరగడం ఆనందదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పంటలపై ఇక్రిశాట్ విజ్ఞానం, ఆవిష్కరణలో.. 50 ఏళ్లుగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలను ప్రధాని అభినందించారు. ఐదు దశాబ్దాల కాలంలో భారత్ ఆహార సమృద్ధి సాధించిందన్న మోదీ.. వచ్చే యాభై ఏళ్లు మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని పీఎం మోదీ స్పష్టం చేశారు.
ఇక్రిశాట్‌ది కీలకపాత్ర..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పంటల దిగుబడి గణనీయంగా ఉందన్న ప్రధాని.. సాగు విస్తీర్ణం పెంచడంలో ఇక్రిశాట్‌ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆయన సూచించారు. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు సృష్టించాలన్నారు. భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారన్న ఆయన.. వారి సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్రిశాట్ పరిశోధనలతో సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. భారత్‌లో 6 రుతువులు 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని పీఎం మోదీ పేర్కొన్నారు.