తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 26న హైదరాబాద్​కు ప్రధాని మోదీ.. - హైదరాబాద్​కు రానున్న ప్రధాని

PM Modi to Visit Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. హైదరాబాద్​ గచ్చిబౌలిలోని ఐఎస్​బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు.

ఈ నెల 26న హైదరాబాద్​కు ప్రధాని మోదీ..
ఈ నెల 26న హైదరాబాద్​కు ప్రధాని మోదీ..

By

Published : May 19, 2022, 2:44 AM IST

PM Modi to Visit Hyderabad: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. మరోవైపు 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ సహా భాజపా అగ్రనేతలంతా రాష్ట్రానికి వస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

తాజాగా ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సమాచారం అందడంతో భాజపా శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను కనివినీ ఎరగని రీతిలో దిగ్విజయం చేసే దిశగా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో పెద్ద ఎత్తున ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. మొత్తంమీద అగ్రనేతల రాకతో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో తెలంగాణలో భాజపా గెలుపు ఖాయమనే సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

మరో వైపు ఈ నెల 26న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని ప్రధానితో ప్రారంభింపజేసే కార్యక్రమానికి సన్నాహాలు జరిగాయి. అదే విధంగా హైదరాబాద్​ శివారు జినోం వ్యాలీలో నిర్మాణం పూర్తయిన జాతీయ జంతు వనరుల సౌకర్య, జీవ వైవిధ్య పరిశోధన సంస్థను ప్రధాని ప్రారంభించాలని పీఎంవోకు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. ఈ రెండింటిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఐఎస్​బీ కార్యక్రమం తర్వాత ప్రధాని చెన్నైకి వెళ్తారని భాజపా వర్గాల సమాచారం. సంజయ్​ యాత్ర సందర్భంగా సభలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హాజరయ్యారు. ఇప్పుడు ప్రధాని 26న వస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతల రాష్ట్ర పర్యటనతో కాషాయదళంలో నూతన ఉత్సాహం నెలకొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details