Secunderabad to Visakha Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. వందే భారత్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడవనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారయ్యే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు గరిష్ఠంగా 180 కిమీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటివరకు నాలుగు పట్టాలెక్కాయి. అయిదోది మైసూర్-బెంగళూరు-చెన్నై రైలు గతేడాది నవంబర్ 10న పట్టాలు ఎక్కింది. దక్షిణ భారతానికి ఇదే తొలి రైలు. ఆరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల మధ్య సేవలందించనుంది.
మరోవైపు తెలంగాణ పర్యటన సందర్భంగా మోదీ దాదాపు రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు కిషన్ రెడ్డి ట్విటర్‌లో తెలిపారు. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ మేర డబులింగ్ రైల్వే లైన్‌ను మోదీ ప్రారంభించనున్నారు. దీంతోపాటు ఐఐటీ హైదరాబాద్‌లోని అకడమిక్ భవనాలు, వసతి గృహాలు, ఫ్యాకల్టీ, స్టాఫ్ భవనాలు, టెక్నాలజీ రీసెర్చ్ పార్కు, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, అతిథిగృహం, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, హెల్త్ కేర్ తదితర భవనాలను మోదీ ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో అతిపెద్ద స్టేషన్ సికింద్రాబాద్‌ను రూ.699 కోట్ల వ్యయంతో పునరభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత భవానాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా దీనికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. గుత్తేదారు ఎంపిక అక్టోబరులోనే పూర్తయింది. రైల్వేశాఖ దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లను పునరభివృద్ధి (రీడెవలప్‌మెంట్) చేస్తోంది.
రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి స్టేషన్ సికింద్రాబాద్. ద.మ.రైల్వే జోన్ ప్రధానకేంద్రం కూడా ఇక్కడే ఉంది. స్థానిక ఎంపీ, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 36 నెలల్లో పునరభివృద్ధి పనులు చేస్తామని ద.మ.రైల్వే ఇటీవల ప్రకటించింది. ఖాజీపేటలో రూ. 521 కోట్లతో నిర్మించతలపెట్టిన రైల్వే పీరియాడిక్ ఓవర్‌హాల్టింగ్ వర్క్‌షాప్‌నకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.