BJP meet in Hyderabad: రెండేళ్లకోసారి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా కొవిడ్ కారణంగా అంతరాయం ఏర్పడింది. కరోనా తర్వాత నిర్వహించే మొట్టమొదటి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో మోదీ హెచ్ఐసీసీ బయలుదేరి వెళ్లారు.
ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో హెచ్ఐసీసీ వేదికగా జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీని సత్కరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , నేతలు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి వారిని సన్మానించారు..
దేశంలో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారిత, స్వతంత్రతను మన స్వాతంత్య్ర సమరయోధులు ఆశించారన్న జాతీయ కార్యవర్గం.. అందుకు అనుగుణంగా కేంద్రంలోని భాజపా సర్కారు పనిచేస్తోందని వెల్లడించారు. సామాజిక భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలపై చర్చించిన కార్యవర్గం.. ప్రజల ఆర్థిక స్వావలంబన దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్లు నడ్డా గుర్తుచేశారు. కరోనా సమయంలో ప్రపంచం, దేశ ప్రజలకు భారత్ అందించిన సేవలు అసమానమైనవని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కీలక నిర్ణయం:ఆజాదికా అమృత మహోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్న వేళ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం.. పార్టీ తీసుకున్న మరో కీలకమైన నిర్ణయమన్నారు. విపక్ష పార్టీలు అవినీతి అక్రమాల్లో మునిగి ఉంటే సమాజ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని గుర్తుచేశారు. బెంగాల్, కేరళలో కార్యకర్తలను చంపుతుడటంపై ఆందోళన వ్యక్తం చేసిన కార్యవర్గం వారి సేవలను ఙ్ఞప్తికి తెచ్చుకుని నివాళులర్పించింది. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతంచేయడంపై కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని 8 ఏళ్ల పాటు కాదు. మరో 20 ఏళ్ల పాటు పాలన అందించాలని కోరుకుంటున్నామని పలువురు నేతలు అభిప్రాయపడ్డారని కేంద్ర మంత్రి స్మతిఇరానీ వెల్లడించారు.