అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్, ఆవిష్కరణల వేదిక అయిన ప్లగ్ అండ్ ప్లే టెక్(plug and play tech center news) సెంటర్ భారత్‌లో తమ తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిసెంబరు మొదటి వారంలో దీనిని ప్రారంభిస్తామని సంస్థ వ్యవస్థాపక ముఖ్య కార్యనిర్వహణాధికారి సయీద్ అమీది వెల్లడించారు. వాహన, జీవశాస్త్రాలు, ఆర్థిక సాంకేతికత, ఆరోగ్య పరిరక్షణ, ఇంటర్నెట్ ఆధారిత సేవలు, విద్యుత్, మౌలిక వసతులు, గతిశక్తి తదితర రంగాల్లో నూతన ఆవిష్కరణలను, అంకురాలను ప్రోత్సహించడంతో పాటు ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను శనివారం ప్లగ్ అండ్ ప్లే సంస్థ సీఈవో సయీద్ పారిస్‌లో కలిశారు. హైదరాబాద్‌లో తమ సాంకేతిక కేంద్రం ఏర్పాటు నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సంస్థ నెట్‌వర్క్‌లో ప్లేబుక్‌తో పాటు 530కి పైగా ప్రపంచ ప్రముఖ సంస్థలు, 35,000 అంకురాలున్నాయి. ఆయా సంస్థలకు రూ.67 వేల కోట్ల మేరకు పెట్టుబడులను సమకూర్చేందుకు సహకరించింది. హైదరాబాద్ సీటెల్‌లో ఉన్న వెంచర్ ఫౌండ్రీ ట్రయాంగులమ్ ల్యాబ్స్ సహకారంతో పటిష్ఠ అంకుర వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సయీద్ పేర్కొన్నారు.
ఆవిష్కరణలకు మరింత ఊతం: కేటీఆర్
ప్లగ్ అండ్ ప్లే((plug and play tech center news)) సంస్థ దేశంలోనే తమ తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్(Minister KTR News) కృతజ్ఞతలు తెలిపారు. సంస్థను స్వాగతిస్తున్నామన్నారు. ఇది రాష్ట్రంలో అంకుర వ్యవస్థకు మరింత ఊతమిస్తుందన్నారు. తెలంగాణ జెడ్‌ఎఫ్, ఫియట్ క్రిస్లర్, స్టెలాంటిస్ వంటి సంస్థల ద్వారా వాహన రంగంలో భారీ పెట్టుబడులు సమీకరించిందని, యంత్ర పరికరాల తయారీ సంస్థలు ప్రథమ, ద్వితీయ శ్రేణి సరఫరాదారులతో ప్రపంచస్థాయి వాహన పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.
పలు సంస్థల సీఈవోలతో భేటీ
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నాలుగో రోజైన శనివారం ఫ్రాన్స్‌కు చెందిన 20కి పైగా పారిశ్రామిక సంస్థల అధిపతులు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వారిని తెలంగాణలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. ఫ్రాన్స్‌లోని రెండో అతిపెద్ద ఔషధ సమూహమైన సర్వియర్ సంస్థ ఆవిష్కరణల విభాగాధిపతి ఒలివియర్ నోస్టీన్, ఇతర ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. వారిని వచ్చే ఏడాది జరిగే బయోఆసియా సదస్సుకు మంత్రి ఆహ్వానించారు.
- ఫ్రాన్స్ సంస్థ బోర్డెక్స్ మెట్రో పొలిస్ సంస్థ నగరాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం లక్సెంబర్గ్ పాలెస్ వేదికగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ప్రభుత్వంతో ఈసంస్థ 2015లో ఒడంబడిక చేసుకుంది. దీనికి కొనసాగింపుగా తాజాగా ఒప్పందం జరిగింది.
- ప్రసిద్ధ వైమానిక సంస్థ సఫ్రాన్ సీఈవో జీన్‌పాల్ అలారీ, సీనియర్ ఉపాధ్యక్షుడు అలెగ్జెండ్రే జైగిల్‌లతో వైమానిక, రక్షణ పరిశ్రమల స్థాపన, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాట్లపై కేటీఆర్ చర్చించారు.
- ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ) ఆగ్నేయాసియా డైరెక్టర్ ఫిలిప్ ఒర్లియాంజ్‌తో మంత్రి భేటీ అయ్యారు.
- థేల్స్ గ్రూప్ ఉపాధ్యక్షుడు మార్క్ డార్మన్, ఆ సంస్థ భారత విభాగాధిపతి ఆశిష్ సరాఫ్‌తో మంత్రి సమావేశమయ్యారు. నవీన సాంకేతిక పరిజ్ఞానాల్లో తెలంగాణ ముందడుగు వేసిన వైనాన్ని, డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా వంటి అంశాలను వారికి వివరించారు. వాహన తయారీ రంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కియోలిస్ సీఈవో బెర్నార్డ్ టాబరీను, విద్యుత్, ఆటోమేషన్ డిజిటల్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు లూక్ రిమోంట్‌ను కేటీఆర్ కలిశారు. సమావేశాల్లో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.
- తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్రాన్స్ సభ్యులు, ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను పారిస్‌లో కలిశారు.
ఇదీ చదవండి:ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్ ప్రమాద ఘంటికలు