Plants Doctor: మనకి ఈరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి పోయి వైద్యుడిని కలిసి మన సమస్యలు చెప్తాం. దానికి తగ్గ చికిత్సనూ తీసుకుంటాం. అలాగే మనలాగే ప్రాణామున్న చెట్లకు సుస్తి చేస్తే.. మరి వాటిని కాపాడాలంటే మనం ఎవరి దగ్గరకు వెళ్లాలనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా. లేదండీ మొక్కలు నాటడం.. వాటిని సంరక్షించడం.. అవి చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టడమే కాని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని అనిపించనేలేదని చెప్తారు చాలామంది.. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ప్రజలు మాత్రం మొక్కలకు సుస్తి చేస్తే.. రామేశ్వరీ సింగ్ దగ్గరకు తీసుకెళ్తారు. చచ్చిపోయే మొక్కలకు కూడా ప్రాణం పోసే ఆమెని అక్కడి ప్రజలు ‘మొక్కల డాక్టరమ్మ’ అని ప్రేమగా పిలుచుకుంటారు. తాజాగా ఐరాస ప్రశంసలు అందుకున్న ఆమె చెప్పే మొక్కల సంగతులు ఏంటో తెలుసుకుందాం..
టెర్రస్‌పై నాలుగు మొక్కలు పెంచాలంటే ఎక్కడ నీరు దిగి పైకప్పు పాడవుతుందో అని భయపడతాం. కానీ రామేశ్వరి టెర్రస్‌పై ఏమాత్రం బరువు పడకుండానే వేలమొక్కలని తేలిగ్గా పెంచి చూపించారు. పరిమిత స్థలంలో, తక్కువ నీటితో వేల మొక్కలను పెంచుతూ.. నగర ప్రజలకు కాలుష్యంపై అవగాహన పెంచుతున్నందుకు యూఎన్‌డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)ప్రశంసించింది. ఈమె భర్త ప్రతాప్‌సింగ్ తోమర్ ఇంధన వనరులు వెలికితీసే నిపుణులు. ముప్పై ఏళ్ల కిందటే వీళ్ల కుటుంబం విశాఖలోని నాయుడుతోటలో స్థిరపడింది. అక్కడే రామేశ్వరి చెట్ల పెంపకాన్ని అభిరుచిగా మలుచుకున్నారు. 25 ఏళ్ల పాటు ఇంటి వద్దే కూరగాయలు, ఆకుకూరలు, పూలమొక్కలు పెంచుతూ మొక్కల పెంపకంపై లోతైన అవగాహన పెంచుకున్నారు. ఉద్యాన శాఖ నిర్వహించే వర్క్‌షాపులకూ హాజరై.. మట్టి నాణ్యత, అంటుకట్టడం వంటి నైపుణ్యాలు సాధించారు. కాలనీవాసులకు మొక్కల పెంపకంపై అవగాహన పెంచుతూ వారి ఇళ్లకు వెళ్లి మరీ వాటి సంరక్షణ చేసేవారు. ఇలా ఆమె చూపిన చొరవతో చాలామంది మిద్దెతోటలు పెంచడం మొదలుపెట్టారు.
సరిపడ ఎత్తులో పెట్టడంతో..
‘మనం ఎంత ప్రేమతో పెంచితే... మొక్కలు అంత చక్కగా పెరుగుతాయి. నీళ్లు పోయడానికి అందే ఎత్తులో స్టాండులని ప్రత్యేకంగా తయారుచేయించి పెట్టుకున్నా. దీనివల్ల నడుం నొప్పి రాదు. మిద్దెపై మొక్కల పెంపకం అనగానే తడికి పైకప్పు పాడవుతుందనో, బరువు పడుతుందనో చాలామంది వెనకడుగేస్తారు. ఆ భయం లేకుండా తుంపర, మంచురూపంలో నీటిని వెదజల్లే ప్రక్రియలు చేసేదాన్ని. నా దగ్గర వేల మొక్కలున్నాయి. వాటికి వారానికి 200 లీటర్ల నీరు సరిపోతుంది’ అంటారు రామేశ్వరి. యూఎన్‌డీపీ విపత్తుల నిర్వహణ, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా టెర్రస్ గార్డెనింగ్‌లో రామేశ్వరి చేస్తున్న కృషిని గుర్తించి ఈ ప్రాజెక్టులో భాగస్వామురాలిని చేసింది. ఆమెతోనే ప్రజలకు సూచనలు, సలహాలు ఇప్పిస్తోంది.