హైదరాబాద్ చైతన్యపురి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్(Gaddi Annaram market)ను బాటసింగారం తరలించే దిశగా పావులు కదుపుతున్న మార్కెటింగ్‌శాఖ గురువారం పండ్ల మార్కెట్లోని కార్యాలయంలో కొందరు వ్యాపారుల అభిప్రాయాలు సేకరించారు. ఉన్నతశ్రేణి కార్యదర్శి పద్మహర్షతోపాటు ఇంజినీరింగ్ అధికారులు వ్యాపారులతో చర్చించారు. ప్రస్తుతం బత్తాయి సీజన్ కావడంతో బత్తాయి వ్యాపారులతోనే మాట్లాడి బాటసింగారంలో తాత్కాలికంగా వ్యాపారం కొనసాగించడానికి అవసరమైన సౌకర్యాలపై చర్చలు జరిపారు. పండ్ల మార్కెట్ స్థలంలో అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందునా తరలింపు తథ్యమని కోహెడలో మార్కెట్ నిర్మాణం జరిగేవరకు తాత్కాలికంగా బాటసింగారంలో కొనసాగించక తప్పదనే అభిప్రాయాలు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో వ్యాపారులు కోర్టును ఆశ్రయించడంతో పండ్ల మార్కెట్ తరలింపునకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
Gaddi Annaram market: గడ్డిఅన్నారం మార్కెట్‌ను బాటసింగారం తరలించేందుకు ప్లాన్ - gaddiannaram fruit market news
హైదరాబాద్‌లోని చైతన్యపురి గడ్డిఅన్నారం మార్కెట్(Gaddi Annaram market)ను బాటసింగారం తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మార్కెటింగ్ శాఖ.. పండ్ల మార్కెట్లోని కార్యాలయంలో వ్యాపారుల అభిప్రాయాలు సేకరించింది.
వ్యాపారులతో చర్చించి మార్గం సుగమం చేసేందుకు అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. వ్యాపారులు మాత్రం వసతులు కల్పిస్తే వెళ్లడానికి సిద్ధమేనని చెబుతున్నారు. బాటసింగారంలో వేలం పాటలు నిర్వహించడానికి అనువుగా ప్లాట్‌ఫారాలు లేవని, అంతకంటే ప్రధానంగా బ్యాంకుల్లేవని.. ఈనేపథ్యంలో లావాదేవీలు కొనసాగించేదెలా? అని అధికారులను వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు కొనసాగుతాయని, డబ్బులకు సెక్యూరిటీ ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవడంతో అసంపూర్తిగానే చర్చలు ముగిశాయి. మరోసారి వ్యాపారులతో మార్కెటింగ్‌శాఖ అధికారులు చర్చలు జరుపనున్నట్లు సమాచారం.
- ఇదీ చదవండి :'10 విద్యార్థులకు మూల్యాంకనంలో న్యాయం'