Planning Department Has Prepared 2023 Report: గతేడాది కాలంగా అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని రూపొందించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలు, వివరాలు, సమాచారంతో 2023 నివేదికను ప్రణాళికశాఖ రూపొందించింది. 2022-23లో రాష్ట్ర స్థూలఉత్పత్తి 13.27 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
జీఎస్డీపీ వృద్ధి 15.6 శాతం ఉందని జీడీపీ వృద్ధి 15.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదికి జీఎస్డీపీ వృద్ధి 16 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2022-23లో రాష్ట్ర స్థూల విలువకు సేవా రంగం 62.8 శాతం, పరిశ్రమలు 19 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాలు 18.2 శాతం జోడించినట్లు సర్కార్ తెలిపింది. ప్రజల తలసరి ఆదాయం 3.17 లక్షలుగా పేర్కొంది. జాతీయ సగటైన లక్షా 71 వేల కంటే లక్షా 46 వేలు అధికంగా ఉన్నట్లు వివరించింది.
2018-21 మధ్య రాష్ట్ర సొంత పన్నుల రాబడుల్లో వార్షిక వృద్ధిరేటు 4.78 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తం రాబడుల్లో పన్నులు, పన్నేతర ఆదాయమే 73.1 శాతం ఉందని, ఇది స్వయం సమృద్ధికి నిదర్శనమని వివరించింది. 2018-21 మధ్య మొత్తం ఖర్చులో అభివృద్ధి వ్యయం 78.1 శాతంగా ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ అనంతర పరిణామాల్లో 2020-21తో పోలిస్తే, 2021-22లో మూలధన వ్యయం 63 శాతం మేర 25 వేల 954 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది.
వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది: 2018-21 మధ్య జీఎస్డీపీలో అప్పుల శాతం 24.7 శాతంగా ఉందని తెలిపింది. స్థూల విలువలో వ్యవసాయ వాటా 2014-15లో 76 వేల 123 కోట్లు ఉండగా, 2022-23 నాటికి 2 లక్షల 17 వేల 877 కోట్లకు చేరుకుందని, వార్షిక వృద్ధిరేటు జాతీయ సగటైన 9.97 శాతాన్ని అధిగమించి. 14.05 శాతంగా నమోదైనట్లు సర్కారు వివరించింది.
2014-15 నుంచి 2021-22 వరకు రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం 117 శాతం పెరిగి, అదనంగా 74.32 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరిందని.. తద్వారా వరి, ఇతర వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని పేర్కొంది. 2015-16లో 45.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2021- 22 నాటికి ఏకంగా 342 శాతం పెరిగి 202.2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరినట్లు తెలిపింది.
పత్తి ఉత్పత్తి 18.85 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25.08 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. 5.25 లక్షల క్వింటాళ్ల విత్తన ఉత్పత్తితో, తెలంగాణ విత్తన రాజధానిగా మారిందని, తాండూరు కందిపప్పుకు జీఐ ట్యాగ్ లభించిందని, 68 వేల 440 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోందని తెలిపింది. గొర్రెల జనాభాలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని, 2012 నుంచి 2019 వరకు 48.5 శాతం పెరిగినట్లు పేర్కొంది.