తెలంగాణ ఎంసెట్-2021 ద్వారానే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు ఉంటాయని యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటి వరకు బాలికలకు మాత్రమే అర్హత ఉండగా... ఇకపై బాలురకూ అర్హత కల్పించనుంది. బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్సు కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు తప్పకుండా తెలంగాణ ఎంసెట్-21లో ర్యాంక్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది. మెరిట్ ఆధారంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 50:50 నిష్పత్తి ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది.
మెరిట్ ఆధారంగా ప్రవేశాలు
నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సును 5వ డీన్ల కమిటీ సూచనతో బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్సుగా మార్చారు. గతంలో ఈ కోర్సును బీఎస్సీ హోం సైన్సుగా పిలిచేవారు. ఇటీవల కాలంలో ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రవేశానికి ఇంటర్మీడియట్, తత్సమాన కోర్సులోని ఆప్షనల్ సబ్జెక్టుల్లో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్‌లో ర్యాంకు పొందిన అభ్యర్థులకు మాత్రమే అర్హత కల్పిస్తూ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించింది.