Police Jobs in telangana : పోలీస్ కొలువు ఎందరికో స్వప్నం.. ఎస్సై పోస్టు కోసం డిగ్రీ, కానిస్టేబుల్ కొలువుకు ఇంటర్ విద్యార్హత అయినా బీటెక్, ఎంటెక్, పీజీ చదివిన ఉన్నత విద్యావంతులూ దరఖాస్తు చేస్తుంటారు. క్రితంసారి 16,925 పోస్టులకు దాదాపు ఆరు లక్షల మంది పోటీ పడ్డారు. ప్రస్తుతం 17,003 కొలువులున్నాయి. మిగిలిన ఉద్యోగాలతో పోల్చితే పోలీస్ కొలువు దక్కించుకోవడంలో దేహదారుఢ్య పరీక్ష కీలకం. గతంలో అయిదు కి.మీ.ల పరుగును సకాలంలో పూర్తి చేస్తేనే ఉద్యోగానికి మార్గం సుగమమయ్యేది. కఠినమైన ఈ నిబంధన వల్ల ఇబ్బందులు తలెత్తడంతో క్రితంసారి నుంచే ఈ ఈవెంట్‌ను తొలగించారు. అయినాసరే మిగిలిన దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించేందుకు నిరంతరం చెమటోడ్చటం తప్పనిసరి.
పీఎంటీ.. పీఈటీలే కీలకం:దరఖాస్తుదారులందరికీ తొలుత ప్రాథమిక రాతపరీక్ష నిర్వహిస్తారు. సామాజిక వర్గాల వారీగా నిర్ణీత మార్కుల్ని సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్(పీఎంటీ)నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థుల ఎత్తు, బరువు వంటి కొలతల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి నిర్ణీత ప్రమాణంలో ఉంటే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ)కు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. ఈ దశలో పరుగు పందెం, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్ వంటి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడా అర్హత సాధించగలిగితే తుది రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే విజేతలను ఎంపిక చేస్తారు.
శారీరక కొలతలు ఇలా..(సెంటీమీటర్లలో...)
800 మీటర్ల పరుగుపై పట్టు సాధించాలి : "పోలీస్ కొలువు సాధించడంలో దేహదారుఢ్య సామర్థ్యం మెరుగుపరుచుకోవడం కీలకం. పురుష అభ్యర్థులు ముఖ్యంగా 800 మీటర్ల పరుగుపై పట్టు సాధించాలి. ఎక్కువ మంది ఈ అంశంలోనే విఫలమవుతుంటారు. అందుకే సన్నద్ధతలో భాగంగా సకాలంలో ఈ పరుగును పూర్తి చేసేందుకు సమయం కేటాయించాలి. మిగిలిన అంశాల్లో శిక్షకుల సూచనలకు అనుగుణంగా నైపుణ్యం సాధించాలి."
- స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ కమిషనర్
సమతుల ఆహారం.. కసరత్తుకు సహకారం : ప్రస్తుతం వేసవి దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ వ్యాయామానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటూ దేహదారుఢ్య పరీక్షల కోసం అభ్యర్థులు కసరత్తులు కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే 7 గంటలలోపు కసరత్తు ముగించుకునేలా చూసుకోవాలంటున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మైదానంలో ప్రాక్టీసు చేయాలని, లేదంటే డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాబట్టి రోజూ 3-4 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని.. నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపిన నీరు, మజ్జిగ వంటివి ఎక్కువ తీసుకోవాలని చెబుతున్నారు. మధుమేహం లేని వ్యక్తులు పుచ్చకాయ, కర్బూజ తీసుకుంటే మేలని చెబుతున్నారు.
దేహదారుఢ్య సామర్థ్యం ఇలా..