తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరి స్మార్ట్‌ఫోన్ నుంచి జూమ్, గూగుల్ క్లాస్‌రూమ్ వంటి మాధ్యమాల ద్వారా వర్చువల్‌గా పిల్లలు తరగతులకు హాజరవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడు తన తల్లి ఫోన్‌లో పాఠాలు వింటూ మధ్యలో వీడియోగేమ్స్ ఆడేవాడు. ప్రతినెల రూ.2వేలు వచ్చే పోస్టుపెయిడ్ మొబైల్ బిల్లు ఈనెల రూ.23వేలు వచ్చింది. వినియోగదారుల సేవాకేంద్రానికి వెళితే ..మీరు ఆ గేమ్‌లు కొన్నందున ఫోన్ బిల్లు కట్టాల్సిందేనన్న సమాధానం వచ్చింది. ఇదే తరహాలో వినియోగదారులు పలువురు చెల్లించాల్సి వచ్చింది. ట్రాయ్‌లో ఫిర్యాదు చేస్తామని, వినియోగదారుల ఫోరంలో సవాల్ చేస్తామని వారంటున్నారు.
ఆన్‌లైన్‌లో వీడియోగేమ్స్ ఆడినా, యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నా కొన్ని ఉచితంగా ఇస్తే.. మరికొన్నింటికి క్రెడిట్, డెబిడ్‌కార్డుల ద్వారా సొమ్ము చెల్లించాలి. వన్‌టైమ్ పాస్‌వర్డ్ ఉంటుంది. పెద్దలకు తెలియకుండా పిల్లలు కొనుగోలుకు యత్నించినా అప్రమత్తం చేస్తుంది. ఇవేవీ లేకుండా టెలికాం ఆపరేటర్లు ‘నాన్ గూగుల్ డేటా’ పేరుతో చిల్లులు పెడుతున్నారు. పిల్లలు వీడియోగేమ్ ఆడుతూ ఒకటి రెండు దశలు పూర్తిచేశాక తదుపరికి వెళ్లాలంటే కొనుగోలు చేయాలనే ఆప్షన్ అడుగుతుంది. చాలామంది నొక్కేస్తున్నారు. రోజూ రూ.500-1000 వరకు బిల్లులో చేరుతుంది. ‘కార్యాలయానికి వెళ్లి ప్రశ్నిస్తే నాన్ గూగుల్ డేటా కింద వచ్చిందన్నారు. ఆన్‌లైన్ ఆటలు, యాప్స్‌కు సంబంధించి కొనుగోలుకు ఇలాంటి సదుపాయం ఉందని.. మీరు ఎక్కువగా వాడటంతో బిల్లు పెరిగిందన్నారు. అప్రమత్తం చేసే వన్‌టైమ్ పాస్‌వర్డ్ లేకపోవడం అంటే సైబర్ భద్రత లేనట్లే. నా బిల్లు రూ.23వేల బిల్లు చెల్లించాను. చేతిలో డబ్బు లేనివారి పరిస్థితి ఏమిటి?’ అని ఓ వినియోగదారు అన్నారు.