PG Medical Student Attempt to Suicide Update: వరంగల్ ఎంజీఎంలో సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉండడంతో రెస్పిరేటరీ ఇంటర్మీడియట్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 5 గంటలు గడిస్తే కానీ వైద్య విద్యార్థిని ప్రీతి పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. దాంతో వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని ప్రీతి తండ్రి నరేంద్ర తెలిపారు. ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. సీపీతో మాట్లాడి విచారణకు ఆదేశిస్తామన్న ఆయన.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన ప్రీతి ఎంబీబీఎస్ పూర్తి చేసి వరంగల్ కేఎంసీలో ఎనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడు నెలల క్రితమే కళాశాలలో చేరింది. అప్పటి నుంచి సీనియర్ విద్యార్ధి సైఫ్ తనని వేధిస్తున్నాడని... ఈ విషయం కొద్ది రోజుల క్రితం తమకు తెలిపిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. సీనియర్లకు ఎదురు తిరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రీతి ఓర్చుకుందని తెలిపారు. వార్డుల్లో విధులు నిర్వర్తించే సమయంలో సహచరుల ముందు, రోగుల ముందు కించపరిచేలా మాట్లాడాడని తెలిపారు.
ఇదే అంశంపై కేఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తండ్రి నరేంద్ర వాపోయారు. తన కుమర్తె తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం మాకు ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్‌ను ప్రీతి వ్యతిరేకించిందని... తనకు మద్దతు పలకాలని తోటి విద్యార్థులను కోరగా రెండు సంవత్సరాలు ఇక్కడే పనిచేయాలి కాబట్టి తమను కూడా వేధిస్తారని తోటి విద్యార్థులు వెనుకడుగు వేశారని ఆయన తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిపై, అలాగే కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.