పెట్రోల్, డీజిల్ ధరలు (petrol diesel price) రోజురోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజువారీ ధరల నిర్ణయం ముసుగులో ధరల పెంపునకు చమురు సంస్థలు తెర తీశాయి. చమురు ధరల పెరుగుదలతో పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అడ్డూ అదుపు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు.
సుంకాల పేరుతో పిండేస్తున్నారు
ముడి చమురు బ్యారెల్ ధర ఆదివారం దాదాపు 75 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ రూ.74.49గా ఉంది. ఈ విలువలను పరిగణనలోకి తీసుకుంటే... బ్యారెల్ ముడి చమురు ధర రూ.5,587గా ఉంది. అంటే లీటర్ ముడి చమురు ధర రూ.35.14. లీటరు ముడి చమురును పెట్రోల్‌గా ప్రాసెసింగ్ చేసేందుకు, రీఫైనరీ మార్జిన్లు, ఫ్రైట్ ఖర్చులు, లాజిస్టిక్స్, ఓఎంసీ మార్జిన్‌లు అన్ని కలిపి లీటరుపై రూ.3.60లు, డీజిల్‌గా ప్రాసెసింగ్ చేసేందుకు, రూ.6.10లుగా ఉంది. అంటే ప్రాసెసింగ్ తరువాత ఒక లీటరు పెట్రోల్ ధర రూ.38.74లు, డీజిల్ ధర రూ.41.24లుగా ఉంది. ఈ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాల పేరుతో దోచేస్తున్నాయి. వ్యాట్, ఎక్సైజ్ సుంకం పేరుతో నిలువు దోపిడి చేస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం పేరుతో కేంద్రం... ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.32.90లు, డీజిల్‌పై రూ.31.80లు విధిస్తోంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27శాతం చొప్పున వ్యాట్ విధిస్తోంది.
నొప్పి తెలియకుండా నడ్డి విరుస్తున్నారు...
రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.104.86, డీజిల్ రూ.97.96కు ఎగబాకింది. అంటే కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు లీటరు పెట్రోల్‌పై రూ.62.33లు, లీటరు డీజిల్‌పై 54.13లు పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో... మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పెట్రోల్‌పై 80పైసలు, డీజిల్‌పై 75పైసలు తగ్గింది. మొత్తానికి ఈ ఆరు నెలల్లో పెట్రోల్‌పై రూ.17.80, డీజిల్‌పై రూ.17.36 పెరిగింది. ధరల పెంపు 15 రోజులుకో నెలకో... ఒకేసారి మూడు, నాలుగు రూపాయిలు పెంచినట్లయితే ఆ భారం వాహనదారులకు స్పష్టం తెలిసేది.. కాని రోజువారీ ధరల నిర్ణయం మాటున... రోజు విడిచి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచుతూ పోతున్నాయి. ఈ ప్రభావంతో సామాన్యుడు వ్యక్తిగత వాహనాలను కూడా బయటకు తీయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.