నింగినంటుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. డీజిల్ రేటు రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్పు చేసి ఆటోలు, కార్లు, వ్యాన్లు కొని నడిపే యజమానులు, డ్రైవర్లు అల్లాడుతున్నారు. తాజాగా ఆదివారం పెట్రోల్ ధర లీటరుపై మరో 36 పైసలు పెరిగి రూ.111.91కు, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.106కు చేరింది. గత ఏడాది కాలంలో లీటరుపై సుమారు రూ.34 పెరగడంతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. నిత్యావసరాల ధరలపైనా ప్రభావం చూపుతోంది. దేశంలో పంటలు ఇబ్బడిముబ్బడిగా పండినా వాటి ధరలు ఆకాశాన్నంటడానికి ప్రధానంగా పెట్రోల్, డీజిల్ ధరలే కారణమని పలువురు టోకు వ్యాపారులు తెలిపారు. పలు రంగాలపై డీజిల్, పెట్రోల్ ధరలు ప్రభావం చూపుతుండటంతో ప్రజలపై అనేక రకాలుగా ఆర్థిక భారం పడుతోంది. నిత్యావసరాలు మొదలుకుని స్కూల్ బస్సు రుసుముల దాకా అన్నీ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల వారి జేబుకు చిల్లు పడుతోంది. ఇంధనం ధరలు ప్రతిరోజూ పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలూ అదేస్థాయిలో అధికమవుతున్నాయి. లారీలు, వ్యాన్లు, ఆటోల కిరాయిల రూపంలో వచ్చిన సొమ్ము డ్రైవర్, క్లీనర్‌ల జీతాలకే సరిపోతోందని.. వాహనం నిర్వహణకు, నెలవారీ కిస్తీలు చెల్లించేందుకూ మిగలడం లేదని యజమానులు పేర్కొంటున్నారు. ఆటోవాలాలదీ అదే పరిస్థితి. పాత ఛార్జీలతోనే నడుపుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు.
- వ్యవసాయంలో అనేక పనులకు వాహనాలు, యంత్రాలు వాడుతున్నందున రైతులపై ఆర్థిక భారం పడుతోంది. డీజిల్ ధరలు పెరుగుతున్నంత వేగంగా తాము అమ్ముతున్న పంటల ధరలు ఎందుకు పెరగడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కూరగాయలు, పండ్లకూ ధరల మంట
మహారాష్ట్రలోని సోలాపూర్, నాసిక్, కొల్హాపూర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నిత్యం లారీల్లో కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యాసరాలు వస్తుంటాయి. డీజిల్ ధర పెరుగుదలతో లారీ కిరాయిలు పెరుగుతున్నాయి. గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. కొన్నిచోట్ల ఇప్పుడు రూ.30 వేల దాకా పెంచారు. దీంతో కూరగాయలు, పండ్ల ధరలూ మండిపోతున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో ఉల్లిగడ్డలు, దానిమ్మ పండ్లు రెట్టింపు ధరలు పలుకుతున్నాయి.
- ఎల్లప్ప, లారీ డ్రైవర్, సోలాపూర్, మహారాష్ట్ర
వరికోత పనులు భారమయ్యాయి
గతేడాదితో పోలిస్తే వరి కోత, నూర్పిడి యంత్రాల కిరాయిని ఎకరానికి రూ.500 దాకా పెంచేశారు. గతేడాది గంటకు రూ.2,200-2,700 తీసుకునేవారు. ఇప్పుడు రూ.2,700-3,200 అడుగుతున్నారు. పొలాల దుక్కులు, ఇతర యంత్రాలతో చేసే పనులకూ కిరాయిలు పెంచేశారు. కూలీలను పొలాల వద్దకు తీసుకెళ్లడానికి గతంలో 2-3 కిలోమీటర్ల దూరానికి ఆటోలకు రూ.100-200 తీసుకునేవారు. ఇప్పుడు రూ.300-400 అడుగుతున్నారు.
- రాజయ్య, రైతు, ములుగు జిల్లా